మానవ సమాజానికే సవాల్ గా మారిన పహల్గాం ఉగ్రవాదుల దుశ్చర్యను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గామ్ లో ఉగ్రవాదులు మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తని మతం అడిగి మరీ హతమార్చారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడికి ప్రతి చర్యగానే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 9 ఉగ్ర స్ధావరాలను పేల్చివేశామని చెప్పారు. ఉగ్రవాద చర్యలకు మన దేశం బలవుతూనే ఉందని, జమ్మూ కాశ్మీర్ లో 46 వేల మందిని ఉగ్రమూకలు బలి తీసుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడం ద్వారా మన సైనికులు నూతన చరిత్రను మన దేశంలోనే ప్రారంభించారన్నారు. గతంలో ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారి ఫొటోల దగ్గర గులాబీ పువ్వు పెట్టి శ్రద్ధాంజలి ఘటించడం వరకే పరిమితం అయ్యేవాళ్లమని కానీ ఇప్పుడు భారత్ పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించామని అన్నారు. ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను, వారి నివాసాలను ధ్వంసం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కరుడుకట్టిన ఉగ్రవాదులను ఈ సారి అంతం చేశామన్నారు. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో మనపై దాడికి ఒడిగట్టిందని కానీ భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని… కొనసాగుతోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మిధాని, డీఆర్‌డీఏ వంటి రక్షణ సంస్ధల్లో వసతులు మెరుగు పరుస్తున్నామన్నారు. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మరింత సిద్దం చేస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ ని ప్రపంచం ముందు దోషిగా నిలబెడతామని కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీలను శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.