ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రౌండ్ రియాలిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తవుతున్నా.. హామీల అమలులో ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటంపై క్షేత్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించాలన్న యోచన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో పార్టీ కేడర్ కూడా ఇబ్బందులు పడుతున్నారన్న వాస్తవాన్ని గ్రహించారు. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాలన పూర్తయిన నాటి నుంచి వేగంగా హామీలను అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో మీటింగ్‌లో చంద్రబాబు.. తన మనసులో మాట చెప్పకనే చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్లినా ఈసారి కూడా కూటమి పార్టీలే పెద్ద సంఖ్యలో స్థానాలను దక్కించుకోవాలంటే ఇచ్చిన హామీలను వీలైనంత తొందరగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి వచ్చే జూన్ 12వ తేదీకి యేడాది నిండుతుంది. అదే రోజు లక్షమందికి పైగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇచ్చే యోచన చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా తేదీలతో సహా త్వరలో క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాది పొడవునా ఏ ఏ హామీలు ఏయే తేదీల్లో తేదీన అమలు చేయాలనుకున్నామో స్పష్టంగా ప్రజల ముందు సమాచారం ఉంచి ఖచ్చితమైన సమాచారం అందచేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా నిర్ణయించిన తేదీల్లో ఆయా హామీలను అమలు చేసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన నిధులను కూడా సిద్ధం చేసుకునేందుకు అధికారులకు కొంత సమయం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఏ నెల నుంచి అమలు చేస్రరన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే, త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఏ జిల్లాకు ఆ జిల్లా స్థాయిలో అమలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీపం పథకం కింద ఇచ్చే మూడు సిలిండర్లకు సంబంధించి కూడా నగదును లబ్దిదారుల ఖాతాలో ముందుగానే జమ చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో.. అసలు సిలిండర్ బుక్ చేసుకున్నారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా ముందుగానే డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా మందికి డబ్బులు అకౌంట్లలో జమ కావడం లేదని ఫిర్యాదులు వస్తుండ వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని చెబుతున్నారు. ఈ కార్యాచరణ వల్ల మహిళల ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంటుందని, ఇటు ఉచిత బస్సు పథకం, అటు దీపం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడమే దీనికి మార్గమని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు.. ఓటు బ్యాంకును కూడా పటిష్టం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. పాక్ – భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశముందని కూడా చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికలు 2027 లేదా 2028 లో వచ్చినా ప్రజల్లో అసంతృప్తిగా లేకుండా అన్ని రకాలుగా గ్రౌండ్‌ను చంద్రబాబు ప్రిపేర్ చేస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమితోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు తగినట్లుగా చంద్రబాబు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటునట్లు చెబుతున్నారు. జగన్ పాదయాత్ర చేసినా తన పథకాలతో జనాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు చంద్రబాబు తనవైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
- Advertisement with us -