పహెల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అనే తీరులో ఉంది ఇరు దేశాల మధ్య పరిస్థితి. ఇలాంటి సమయంలో యూనైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటారెస్ నుంచి ఇరు దేశాలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. అయితే ఆరా తీసి.. సంతాపం తెలిపినందుకు భారత్ ధన్యవాదాలు తెలపగా.. దాయాది దేశం మాత్రం భారత్‌పై ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశాన్ని వాడుకుంది.
విదేశాంగమంత్రి జైశంకర్‌తో మాట్లాడిన ఆంటోనియో.. ఈ ఉగ్రదాడిని ఖండించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన తెలిపినట్టు జై శంకర్ తెలిపారు. అంతేకాదు దీనికి కారణమైన వారిని.. ఈ దాడులను ప్లాన్ చేసిన వారిని వదిలేది లేదని చెప్పినట్టు తెలిపారు జై శంకర్.
ఇదే సమయంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఈ కాల్‌పై స్పందించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని.. అదే సమయంలో భారత్ చేస్తోన్న నిరాధార ఆరోపణలను ఖండిస్తోందన్నారు. పహెల్గామ్పై నిష్పాక్షికమైన విచారణ కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో జమ్ము కశ్మీర్ అంశాన్ని UN సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్స్‌కు అనుగుణంగా పరిష్కరించాలని కోరారు. తాము శాంతిని కోరుకుంటున్నామని.. కానీ తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటామని ఆయన ఆంటోనియోకు తెలిపారు.
మొత్తానికి ఇరు దేశాలు యూఎన్ ముందు తమ వాదనను వినిపించాయి. అయితే ఓ వైపు ఉగ్రదాడులు జరుగుతుంటే.. కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం పాకిస్థాన్‌కు చెల్లిందని చెప్పాలి. అంతేకాదు తమపై దాడులు చేస్తే ఎదుర్కొంటామంటూ ప్రకటించడం చూస్తుంటే.. భారత్ తప్పక దాడులు చేస్తుందని పాకిస్థాన్‌కు ఇప్పటికే అర్థమైందని తేలిపోయింది.