చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తుల తాకిడి పెరిగింది. హిందూ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్షణం ఇక రానే వచ్చిందని చెప్పాలి. అక్షయ తృతీయ రోజును పురస్కరించుకొని గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ ఆలయాల ద్వారాలు తెరుచుకుంటే అధికారికంగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైందని అర్థం. మంగళవారం ఉదయం 11.57 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ముఖబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్‌కు గంగామాత్ర డోలి బయలుదేరింది. ఈరోజు ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్ చేరింది. ఉదయం 10.30 గంటలకు గంగోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకోగా… ఉదయం 11.55 గంటలకు యమునోత్రి ధామ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
ఇక కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకోనున్నాయి. శీతాకాలం సందర్భంగా ఆరు నెలల పాటు ఆలయాలను మూసివేశారు. కశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భద్రతా ఏర్పాట్లపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేఠ్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 217 సెక్టార్‌లుగా విభజించారు. సీసీ కెమెరాల సంఖ్యను కూడా పెంచారు. ఈ సారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్‌పీ, డీఎస్పీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది చార్‌ధామ్ యాత్రలో 48లక్షల మంది పాల్గొన్నారు. ఈసారి కూడా భారీ స్థాయిలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చార్‌ధామ్ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.