ఆ 38 సీట్లే కీలకం..
ముస్లింలూ బీజేపీ వైపు మళ్లుతున్నారా ?
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపుకి ముస్లింలే పరోక్షంగా దోహదపడ్డారా? ముస్లింలు బీజేపీ వైపు మళ్లుతున్నారా? ఎన్నికల్లో పోలింగ్ సరళి అభ్యర్ధుల పెర్ఫార్మెన్స చూస్తే కలిగే అనుమానాలివి..జాతి వైరుధ్యం పరోక్షంగా చూపే బీజేపీ, ముస్లిం పార్టీలు ఈ సారి కలసి అడుగులేశారా?ముస్లిం ఓటర్ల మనోగతం చూస్తే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ఏక్ నాథ్ షిండే అభివృద్ధి పథకాలు బీజేపికి అంత స్వీపింగ్ విక్టరీ అంద చేయడంలో ఒక భాగం మాత్రమే…నిస్సందేహంగా ఈ ఎన్నికల్లో ముస్లింలు అనుకున్నంతగా రాణించలేదనే చెప్పాలి. ఎందుకంటే బీజేపి గెలిచిన ప్రాంతాల్లొ చెప్పుకో దగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. ముస్లింలు 20శాతం కన్నా ఎక్కువ ఉన్న స్థానాల్లో బీజేపి ఏకంగా 38సీట్లు గెలుచుకుంది..మహా వికాస్ అగాఢీ బలంగా ఉన్న ఈ స్థానాల్లో ఈసారి ఆ కూటమిని చావుదెబ్బ తీసింది బీజేపి కూటమి. గతంలో ఇక్కడ 13 సీట్లు కంటే ఎక్కువ సాధించిన మహా వికాస్ అఘాడీ ఈసారి వాటన్నింటినీ మహాయుతికి ధారాదత్తం చేయాల్సి వచ్చింది . ముస్లింలు ఈ సారి చీలిపోయారు.ఈ చీలిక సహజంగా ముస్లిం ఓటు బ్యాంకుకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ను దెబ్బ తీసింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కు 11 సీట్లు వస్తే ఈసారి అవి 5కి పడిపోయాయి. శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 6 స్థానాలు గెలచుకోగా ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ కేవలం రెండు సీట్లకు పరిమితమైంది. 2019లో బీజేపీ ఇక్కడ 11 సీట్లు గెలుచుకుంటే ఈసారి మరో రెండు అదనంగా గెలిచి 14 సీట్లు సాధించింది. ఇక సమాజ్ వాదీపార్టీ రెండు సీట్లు గెలుచుకోగా అసదుద్దీన్ కు చెందిన ఎంఐఎం కేవలం ఒక్కటంటే ఒక్క సీటు సాధించింది.బీజేపి సాగించిన దూకుడు ప్రచారం ఇక్కడ ఎంఐఎం ను దారుణంగా దెబ్బ తీసింది. ముస్లిం మతపెద్దలు ఈసారి ఎవరికి వారు చీలిపోవడం ముస్లింలను గందరగోళంలో పడేసింది. అదే టైమ్ లో బీజేపి దూకుడు పెంచి ఓట్ జిహాద్ లాంటి ప్రచారం చేయడం హిందువులపై గట్టి ప్రభావమే చూపింది. ఏక్ హైతో సేఫ్ హై అన్న బీజేపి నినాదం తారక మంత్రంలా పనిచేసిందనే చెప్పాలి. అది మహా వికాస్ అఘాడీ కూటమిపై గట్టి గా పడింది. అయితే ఇందులో వశీకరణ మంత్రమేదీ లేదని షిండే సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఎన్నికల ఫలితాలను సమీక్షించిన పెద్దలు చెబుతున్న మాట. మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో మహావికాస్ అఘాడీ కూటమికి బ్రహ్మ రథం పట్టిన ఓటర్లు అసెంబ్లీ నాటికి అట్టు తిరగేసినట్లు మహాయుతికి పట్టం కట్టడం నిజంగా ఆశ్చర్యకరమే. దీనికి తోడు పులిమీద పుట్రలా అనేక స్థానాలలో ఇద్దరు ముగ్గురు ముస్లిం అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎటూ తేల్చుకోలేక ఓటర్లు మహాయుతి వైపు మళ్ళారనుకోవాలి. ముస్లింలు ఎక్కువగా ఉండే సెంట్రల్ మాలేగావ్లో సునాయాసంగా గెలవాల్సిన ఏఐఎంఐఎం అభ్యర్థి ముఫ్తీ ఇస్మాయిల్ చచ్చి చడీ కనాకష్టంగా162 ఓట్లతో గట్టెక్కాడంటేనే ముస్లింలు కూడా ఈ సారి బీజేపీ వైపే ఉన్నారని అని అనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికలు ఎంఐఎంకే కాదు.. ముస్లిం ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసే కాంగ్రెస కి చెంప పెట్టులా మారాయనే అనుకోవాలి. చూడబోతే ముస్లిం ఓటు బ్యాంకు కూడా నెమ్మదిగా కమలనాథులవైపు మళ్ళుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.