29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

తొలి షాహీ స్నాన్‌ కు కోటిమంది..

  • మహా కుంభమేళాలో పోటెత్తుతున్న భక్త జన సందోహం
  • అమృత ఘడియల్లో షాహీ స్నాన్‌ ఆచరించిన నాగ సాధువులు
  • మూడు గ్రూపులుగా అఖాడాల విభజన
  • అందరినీ స్లాట్‌ ల వారీగా అనుమతి
  • రద్దీ పై సీఎం యోగీ గంట గంటకూ ఆరా
  • 25నుంచి ఢిల్లీ టు ప్రయాగ్‌ రాజ్‌ ఎయిర్‌ ఇండియా డైలీ సర్వీసులు

ఎముకలు కొరికే చలి.. తెరలు తెరలుగా కురుస్తున్న మంచు తుంపరలు.. వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్నా మహాకుంభమేళాకు తరలి వచ్చే భక్తులు వీటికే మాత్రం వెరవడం లేదు. ఒక్క మకర సంక్రాంతి పర్వదినం రోజునే ఏకంగా కోటిమంది పుణ్నస్నానాలు ఆచరించారు. పైగా సంక్రాంతి పర్వదినం రోజున అమృత ఘడియలు కూడా ఉండటంతో షాహీ స్నాన్‌ కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అసలు కుంభమేళా తొలిరోజునే లక్షల్లో తరలి వచ్చిన భక్త జన సందోహం మన ఐక్యతను, వసుధైక కుటుంబ భావనను చాటి చెప్పిందని యూపీ ప్రభుత్వం కామెంట్‌ కూడా చేసింది. ట్రాఫిక్‌ మేనేజ్‌ మెంట్ కు, నదీ ఘాట్‌ వద్ద ప్రమాద వశాత్తు నీటిలో పడిన వారిని రక్షించేందుకు యూపీ ప్రభుత్వం పోలీస్‌ విభాగం ఆధునిక టెక్నాలజీని, ఏఐ టూల్స్ ను విరివిగా ఉపయోగిస్తోంది. అమృత ఘడియలు మంగళవారం అర్దరాత్రి వరకూ ఉండటంతో అఖాడాలకు ఘాట్‌ వారీ కేటాయింపులు కూడా చేసేశారు. శ్రీ పంచాయతీ అఖాడా, నయా ఉదాసీన్, అండ్‌ నిర్వాణ అఖాడాలు మంగళవారం 1.30 కి స్నాన్‌ ఘాట్‌ కు చేరుకున్నారు. అమృత ఘడియల్లో స్నానం చేసిన చివరి అఖాడా శ్రీ పంచాయతీ నిర్మల్ అఖడా. ఇది అర్ధ రాత్రి 2.40కి అమృత స్నానం ముగించింది. దీంతో అమృత ఘడియలు కూడా ముగిసాయి. షాహీ స్నాన్‌ ప్రారంభమైనప్పుడు అఖాడాల స్నాన ఘాట్‌ ల దగ్గర హెలికాప్టర్లతో గులాబీ రేకల వర్షం కురిపించారు. స్నాన ఘట్టాలన్నీ గులాబీ పరిమళాలతో, గులాబీ రంగు రేకలతో నిండిపోయి వింత శోభను సంతరించాయి. ఆకాశం నుంచి గులాబీల వర్షం కురుస్తుంటే భక్తులు జై శ్రీరామ్‌, హర్‌ హర మహదేవ్‌ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

నాగసాధువులకే ముందు అవకాశంఎందుకు?

నాగ సాధువులు ఏడాదంతా అడవుల్లో, హిమాలయాలలో సంచరిస్తూ బయటి ప్రపంచానికి కనపడకుండా పరమ సాత్వికంగా గడుపుతుంటారు. ఈ సాధువులందరూ పరమ శివుని భక్తులు. వారిని దేవుడు పంపిన వారిగా గుర్తిస్తారు. కాబట్టి వాళ్లకే కుంభమేళాలో తొలి అవకాశం కల్పించడం ఆనవాయితీ. ఎంతో నియమ నిష్టలతో ఉండే వారికే తొలి అవకాశం కల్పించాలన్న సంప్రదాయం వచ్చింది. ఈ సారి 13 అఖాడాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఉదాసీన్‌, బైరాగీ (వైష్ణవ), సన్యాసీ (శైవులు) లుగా విడదీశారు. అమృత స్నానాల కోసం అఖాడాలు తరలి రావడం 8వ శతాబ్దం నుంచే ఉంది. ప్రతీసారీ అమృత స్నానాల దగ్గరే అఖాడాలకు ప్రభుత్వాధికారులకు గొడవలు వస్తుంటాయి. వారికి ప్రత్యేక వసతులు, కల్పించకపోతే వారు తిరగబడతారు. అందుకని అమృత స్నానాలకు ముందు వారిని అనుమతించిన తర్వాతే ఇతరులను అనుమతించే సంప్రదాయం అలవడింది.

రెండు రోజుల్లో మూడున్నర కోట్ల మంది

మరో వైపుమహాకుంభమేళా ఆరంభమైన రెండు రోజుల వ్యవధిలోనే మూడున్నర కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌ తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంత ఘనమైనవో తెలిపేందుకు కుంభమేళా ఒక్కటి చాలని యోగీ వ్యాఖ్యనించారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ పర్యవేక్షణలో ఈ సారి ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయని అంటున్నారు. కుంభమేళా దగ్గర రద్దీ ని గంట గంటకూ యోగీ వాకబు చేస్తున్నారు.

ఎయిర్‌ ఇండియా డైలీ ఫ్లైట్ సర్వీస్..

మహాకుంభమేళాకు రద్దీ రోజు రోజుకీ పెరుగుతుండటంతో ఎయిర్‌ ఇండియా ఢిల్లీ టు ప్రయాగ్‌ రాజ్‌ డైలీ విమానాలను నడుపుతోంది. ఈ సర్వీసులు ఈనెల 25 నుంచి మొదలై ఫిబ్రవరి 28 వరకూ నడుస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com