ఈ యేడాది వర్షాకాలం ముందుగానే పలకరించనుంది. ఈనెల 27వ తేదీనే నైరుతి రుతు పవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లు అదే సమయంలో రుతు పవనాలు కేరళను తాకితే మాత్రం.. వర్షాకాలం ఈ సారి ముందుగానే వస్తున్నట్లు లెక్క. 2009 తర్వాత తొలిసారి ఇలా వర్షాకాలం ముందుగా రాబోతోంది. ఐఎండీ డేటా ప్రకారం.. 2009 యేడాదిలో మే నెల 23వ తేదీనే నైరుతీ కేరళను తాకాయి. ఇప్పుడు ఈ యేడాది కూడా ఈనెల 27వ తేదీనే రుతు పవనాలు వస్తాయంటోంది ఐఎండీ.
సాధారణంగా అయితే, ప్రతి యేడాదీ జూన్ ఒకటో తేదీ వరకు నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ రుతుపవనాలు కేరళను తాకిన తర్వాతే దేశవ్యాప్తంగా వర్షాకాలం మొదలవుతుంది. అప్పటినుంచీ జూలై 8వ తేదీలోగా నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. ఇక సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి రుతు పవనాలు తిరోగమనం చెందుతాయి. అక్టోబర్ 15వ తేదీలోగా ఆ రుతుపవనాలు తిరిగి వెళ్లిపోతాయి.
మరోవైపు.. ఈ యేడాది వర్షాకాలంలో.. సాధారణం కన్నా అధికంగానే వర్షం కురుస్తుందని ఏప్రిల్లోనే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉండబోవని ఐఎండీ పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం సాధారణ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.