సౌత్ ఇండియా అన్న.. ఇక్కడి నుంచి ఎదిగినవారన్న ఎందుకో బాలీవుడ్ వారికి కాస్త చిన్న చూపే. అవకాశం దొరికితే చాలు అవహేళన చేయడానికి రెడీగా ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారంలా మారిపోయింది. అందరూ అలానే ఉంటారని కాదు.. కానీ కొందరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. కపిల్ శర్మ టాక్ షోకు వెళ్లారు ది గ్రేట్ డైరెక్టర్ అట్లీ. తన నెక్ట్స్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్‌లో భాగంగా వెళ్లారక్కడికి. ఇంతలో కపిల్ శర్మ తన కపట ప్రేమను బయట పెట్టేశారు. అనాలనే అన్నారో.. అనుకోకుండా అన్నారో కానీ.. అట్లీ లుక్స్‌పై సెటైర్లు వేశారు. మీరు కథలను చెప్పడానికి వెళ్లినప్పుడు.. స్టార్ హీరోలు అట్లీ ఎక్కడ అని అడుగుతారా? అని క్వశ్చన్ చేశారు. నిజానికి ఇది తన లుక్‌పై కపిల్ శర్మ చేసిన డైరెక్ట్ అటాక్.
కానీ అట్లీ మాత్రం ఎలాంటి కోపం తెచ్చుకోకుండా.. అదే నవ్వుతో.. కూల్‌గా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తనకు చాన్స్ ఇచ్చిన వారు తన కలర్ చూడలేదని.. కేవలం తన స్క్రిప్ట్‌ను మాత్రమే చూశారన్నారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టారు. తనకు లైఫ్ ఇచ్చిన ఏఆర్ మురగదాస్ తన లుక్స్ గురించి పట్టించుకోలేదని.. తన టాలెంట్‌ను మాత్రమే నమ్మారని చెప్పారు. నిజానికి ఏఆర్ మురగదాస్ ప్రస్తావన తీసుకురావడం కూడా హైలేట్. ఎందుకంటే ఈ మురగదాసే బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో గజినీ మూవీ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా ఇన్‌డైరెక్ట్‌గా గుర్తు చేసినట్టైంది.
ఓ వైపు సౌతిండియా మూవీస్ బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్న సమయంలో.. వరుస ఫ్లాప్‌లు, కలెక్షన్లు లేక ఈగలు తొలుకుంటున్న బాలీవుడ్‌కు మళ్లీ బూస్ట్ ఇచ్చింది అట్లీ. షారూఖ్‌ఖాన్‌తో జవాన్ అనే సినిమా తీసి బాలీవుడ్‌కు మళ్లీ ఊపిరిపోశాడు ఈ దక్షిణాది డైరెక్టర్. ఈ విషయాలన్ని మర్చిపోయాడేమో కపిల్ శర్మ.. ఏకంగా అట్లీ లుక్‌పై సెటైర్లు వేశాడు.