ఇప్పటి వరకు జరిగిన ప్రచారం.. వినిపించిన ఊహాగానాలన్ని నిజమని తేలిపోయింది. టీమిండియా క్రికెట్ ప్లేయర్ చాహల్, యూటూబ్యర్ కమ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో విరి వివాహ బంధానికి చెక్ పడినట్టైంది. ఇక ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించాడు.
వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై ఇద్దరు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్‌లు పెడుతూ తమ అభిప్రాయాలను చెబుతూ వెళ్లారు. దీంతో అంతా డైలామాలో పడ్డారనే చెప్పాలి. ఇదంతా తప్పుడు ప్రచారమని కొందరు.. లేదు జరగాల్సిందంతా జరిగిపోయిందని మరికొందరు.. ఇలా సాగిపోయింది ప్రచారం. కానీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో విషయం ఏంటో తేలిపోయింది.
ధనశ్రీకి భరణం కింద ఇవ్వాల్సిన రూ.4.75 కోట్లలో.. ఇప్పటికే రూ.2.37 కోట్లు ఇచ్చేసినట్టు సమాచారం. వీరిద్దరి విడాకుల కేసుపై కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా.. తప్పనిసరి ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో డిసెంబర్ 22, 2020న చాహల్‌కు పెళ్లి అయ్యింది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా కనిపించారు వీరిద్దరు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో విడిగానే ఉంటున్నారు. గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలీట్ చేసింది.