ఐపీఎల్‌లో ఎట్టకేలకు బోణి కొట్టింది ముంబై ఇండియన్స్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్స్ పట్టికలో తన అకౌంట్‌ను తెరిచింది. కేవలం గెలుపు మాత్రమే కాదు.. కొన్ని రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది ముంబై ఇండియన్స్.
సొంత మైదానంలో ముంబై మరోసారి రికార్డ్ సృష్టించింది. మొదట ముంబై బౌలర్లు KKRను పక్కాగా కట్టడి చేశారు. ఒక పరుగుకు తొలి వికెట్.. రెండో పరుగుకు రెండో వికెట్.. ఇలా మొత్తం 116 పరుగులకే ఆలౌట్ చేశారు ముంబై బౌలర్లు. ఇక ముంబై ఇండియన్స్ మరో ఆణిముత్యాన్ని ఇండియన్ క్రికెట్‌కు పరిచయం చేసినట్టే అని చెప్పాలి. యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్‌లోనే తానేంటో చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువపేసర్ పెవిలియన్‌కు పంపించాడు. మొత్తంగా 24 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అశ్వనీ.
117 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు ఆడుతూ.. పాడుతూ టార్గెట్‌ను చేజ్ చేశారు. 12.5 ఓవర్లకే టార్గెట్ ఫినిష్ చేసింది ముంబై. రికెల్‌టన్ 41 బంతుల్లో 62 పరుగులు చేసి కేకేఆర్‌కు చుక్కలు చూపించాడు. మరోసారి రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఆ తర్వాత చివర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 9 బంతులు ఆడిన సూర్య.. రెండు సిక్స్‌లు.. 3 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. ముంబై జస్ట్ 2 వికెట్ల నష్టానికే టార్గెట్ ఛేదించింది.
కేవలం గెలుపు మాత్రమే కాదు.. సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా రికార్డుకు ఎక్కింది. వాంఖడే వేదికగా కోల్‌కతాపై ఇప్పటివరకు ముంబై 10 సార్లు విజయం సాధించింది. ముంబై కంటే ముందు కోల్‌కతా జట్టు ఈడెన్ గార్డెన్‌లో పంజాబ్‌పై 9 సార్లు గెలిచి ఒకే ప్రత్యర్థిపై ఒకే వేదికలో ఎక్కువ సార్లు గెలిచిన జట్టుగా ఉండేది. కానీ ఈ మ్యాచ్‌తో ఈ రికార్డు ముంబై ఖాతాలో పడింది.