36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సెంట్రల్‌ వర్సిటీ భూములు ఇంచు కూడా లాక్కోలేదు – మంత్రి శ్రీధర్‌ బాబు

హెచ్‌సీయూ భూముల వివాదంపై మంత్రులు క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హెచ్‌సీయూ భూముల్లో ఒక్క ఇంచు కూడా తాము లాక్కోలేదని మంత్రులు స్పష్టం చేశారు. 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సురక్షితంగా ప్రజలకు చెందేలా చేసినందుకు అభినందించాల్సింది పోయి.. విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.

ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడిందని.. దీనిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సెంట్రల్‌ యూనవర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కోలేదని వారు స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రులు ఆరోపించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల విషయంలో కొన్ని అపోహలు, అనుమానాలు వ్యాప్తి అవుతున్నాయని, ఆ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ పక్షాలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమి ఇన్ని రోజులు సుప్రీం కోర్టు పరిధిలో ఉందని ఆయన తెలిపారు. HCU విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి సంబంధించిన భూములను ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు, పార్టీల అనుబంధ సంఘాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. దీనిపై హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఈ భూముల విషయం చాలా సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్‌లో ఉందని, గతంలో దీనికి సంబంధించిన పత్రాలు యూనివర్సిటీ దగ్గర లేవని చెప్పుకొచ్చారు.

ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని.. 2003లో అప్పటి ప్రభుత్వం పొరపాటు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజల కోసం ఉపయోగించాలని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పు ప్రచారం చేస్తుండడంతో ఈ విషయం మరింత ఉత్కంఠగా మారిందని, హెచ్‌సీయూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు కేసుల్లో ఉన్న భూములపై కార్యాచరణ వేగవంతం చేసిందని ఆయన అన్నారు.

ప్రభుత్వం రాళ్లు, చెరువులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందని, త్వరలోనే ప్రభుత్వ ఆస్తులపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com