25.6 C
Hyderabad
Sunday, June 28, 2026

Live Video

spot_img

శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించం -భట్టి విక్రమార్క

హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నాయకులు ఆ పార్టీ మాజీ ఎంపీ, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రమేష్ బిదోరిని బీజేపీ నుంచి.. వెంటనే సస్పెండ్‌ చేయాలని.. అలాగే, ఎంపీ ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతదేశంలో స్త్రీల మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ, కార్యాలయంతో పాటు.. గాంధీభవన్‌పై జరిగిన దాడులను ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఎవరిపై దాడులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పామని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో గాంధీ భవన్,  బీజేపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామం నుంచి స్పందించారు. బీజేపీ ఆఫీసుపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఉప ముఖ్యమంత్రిగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఖండించామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని భట్టి విక్రమార్క చెప్పారు.

బిజెపి కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాడి చేసిన విషయం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియదని, వాళ్లతో తాను కాసేపటిక్రితమే ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. ప్రజా ప్రభుత్వం దాడులను ఉపేక్షించబోదన్నారు. కొంతమంది బిజెపి నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందుగా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పండని, వాళ్లకు సంస్కృతి, సంస్కారం నేర్పించాలని హితవు పలికారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. దేశ సంస్కృతిని దిగజార్చే పరిస్థితి తెచ్చినందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను దేశం పైన ప్రేమ, అభిమానం, స్త్రీల పైన గౌరవం ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ పట్ల బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను రెండు రోజులైనా కేంద్ర నాయకత్వం ఖండించకపోవడం విచారకరమన్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక తాత్కాలిక ఆవేశంతో కొంతమంది యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడిచేశారని, అయితే ఆ సంఘటనను తాము బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులుగా ఖండిస్తున్నానన్నారు.

రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదన్నారు భట్టి విక్రమార్క. అహింస, గాంధేయ మార్గంలో ఎదుటివారి తప్పులను ఎత్తిచూపుతూ ప్రజాస్వామ్యంగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడమే తప్ప, భౌతిక దాడులను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడూ కూడా ప్రోత్సహించదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ హక్కును వినియోగించుకొని తమ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి తప్పితే… రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలకు ఏ పార్టీ కూడా పాల్ఫొడొద్దని సూచించారు. లోక్‌సభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రమేష్ బిదోరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా బిజెపి నాయకత్వం కళ్లు మూసుకొని నిద్ర పోతుందా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రెండు రోజులు గడుస్తున్నా ఈ ఆటవిక వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే స్పందించి రమేష్ బిదోరిని సస్పెండ్ చేసి ఉండాల్సిందన్నారు. అయినా, కనీసం స్పందించ లేదని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించేలా బీజేపీ కేంద్ర నాయకత్వం గాలికి వదిలేయడం తగదన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com