తెలంగాణలో రాష్ట్రపతి పాలన కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపి కార్యకర్తలపై, రాష్ట్ర పార్టీ ఆఫీస్ పైన దాడులు సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణలో బిజెపి కార్యకర్తలపై దాడులు ప్రస్తావించిన విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్ ఆయన మాటల్లోనే..
ప్రభుత్వాలు తమ విధి మర్చిపోయి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం తప్ప మార్గం ఉండదు. తెలంగాణలో వ్యవస్థలన్నీకప్పకూలిపోయాయన్నదానికి భారతీయ జనతా పార్టీ ఆఫీసుపై జరిగిన కాంగ్రెస్ మూకదాడే సాక్ష్యం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. శాంతిభద్రతలు తమ అధీనంలో ఉంటాయని ఓ చిన్న రాయి ఎదుటివారిపై పడిన అది వారి అరాచకవాదమే. అలాంటిది నేరుగా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ ఆఫీసుపై దాడి చేస్తారా ? మూకను ఉసిగొల్పి రాళ్లు చేతికిచ్చి పంపిస్తారా ?
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలపై ప్రభుత్వాలే ఇలాంటి మూకదాడులను ప్రోత్సహిస్తే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుత నిరసనలు చేయవచ్చు? అయినా ఢిల్లీ రాజకీయాలకు తెలంగాణకు సంబంధం ఏమిటి ? అక్కడి ఎన్నికల్లో రాజకీయ నేతలు విమర్శలు చేసుకుంటే తెలంగాణ ఆఫీసుపై దాడి చేయడమేంటి ?
తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలోనే హోంమంత్రిత్వ శాఖ కూడా ఉంది. ఆయనే ఈ దాడికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తక్షణం నిందితుల్ని అరెస్టు చేసి భారతీయ జనతా పార్టీకి భేషరతు క్షమాపణ చెప్పకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే ఈ దాడులకు వ్యూహరచన చేశారని అనుకోవాలి. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే అంత కంటే తీవ్రమైన పొరపాటు ఉండదని హెచ్చరిస్తున్నాం. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తారా?
గతంలో ఏపీలో ఇలా ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన పార్టీకి ప్రజలు ఏ గతి పట్టించారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. తక్షణం ఈ ఘటనను ఖండించి .. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టి వెంటనే జైళ్లకు పంపాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.