29.5 C
Hyderabad
Friday, June 26, 2026

Live Video

spot_img

డీ లిమిటేషన్‌పై హైదరాబాద్‌లో నెక్ట్స్‌ మీటింగ్‌

చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల డీ లిమిటేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుంచి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఓ సంకేతం పంపించారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదన్న డిమాండ్‌ను ఈ సమావేశానికి హాజరైన వాళ్లందరూ ముక్తకంఠంతో వినిపించారు. అవసరమైతే మరో 25 సంవత్సరాలు పునర్విభజనను వాయిదా వేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

ఈ సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధ్యక్షత వహించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌, కనర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ పార్టీ నుంచి మాజీ ఎంపి అమర్‌ పట్నాయక్‌, మాజీ మంత్రి సంజయ్‌ దాస్‌ బర్మా, శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ తదితరులు ఈ జేఏసీ మీటింగ్‌లో పాల్గొన్నారు.

అయితే, డీ లిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌ చొరవను తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెండో సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తన ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఐక్యంగా పోరాడి మన హక్కులను పరిరక్షించుకుందామని రేవంత్‌ పిలుపునిచ్చారు. మ‌న పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ‌దామ‌నే విష‌యాన్ని హైదరాబాద్‌లో జరిగే స‌మావేశంలో చ‌ర్చిద్దామన్నారు. ఈ పోరాటంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను కూడా ఏర్పాటు చేస్తానని రేవంత్‌ స్పష్టం ేశారు. ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన అన్న‌త‌మ్ముళ్లు, అక్కా చెల్లెళ్లంతా క‌లిసి వ‌చ్చి.. మ‌న హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం నిర్వహించబోతున్నామని, కేంద్రంలోని అధికార బీజేపీకి కనువిప్పు కలిగేలా వచ్చే నెలలోనే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మీటింగ్ కు హాజరైన వాళల్లందరినీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మీటింగ్‌కు ఆహ్వానించారని అందరూ సుముఖత వ్యక్తం చేశారన్నారు. హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి కూడా తమిళనాడు, కేరళ, పంజాబ్, సీఎంలు ఎం.కే స్టాలిన్, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అందరూ వస్తారన్నారు. ఈ సభకు సంబంధించి త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు.

మరోవైపు.. జేఏసీ సమావేశంలో డిఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తమ వెంటే ఉన్నారని, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన కూడా తమతో కలిసి వస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే రెండో సమావేశానికి జగన్‌ హాజరవుతారని కనిమొళి చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com