ఢిల్లీలో ఈరోజు(సోమవారం) అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా శాసనసభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు, కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకున్నారు. ఉదయం రాజ్ నివాస్‌లో ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు.
కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను స్పీకర్‌గా ఎన్నుకోనున్నారు. రెండో రోజు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం ముగియగానే ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. 26 శివరాత్రి సెలవు కాగా ఫిబ్రవరి 27న గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోగానే అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ(70 అసెంబ్లీ సీట్లు) ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. బలమైన మెజారిటీతో గెలచిన బీజెపి అధికారం చేపట్టగా ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) కేవలం 22 స్థానాలు మాత్రమే నెగ్గి ప్రతిపక్షంలో కూర్చుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ ముఖ్యమంత్రి, కల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆతిశీని ఆప్ ఎన్నుకుంది.
కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆప్ ఇచ్చిన హామీలతో పాటు బీజెపి ఇచ్చిన కొత్త హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటు యమున నది ప్రక్షాళన కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఢిల్లీ బీజెపి నేతలు భరోసాగా చెపుతున్నారు.