నేపాల్ మరోసారి కంపించింది. గత నెలలో మిగిల్చిన విషాదాన్ని మర్చిపోకముందే.. మరోసారి కంపించింది నేపాల్. ఈసారి రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అయితే ఈసారి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. నేపాల్‌లో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య భూమి కంపించింది. దాదాపు 35 సెకన్ల పాటు భూమి కంపించడంతో… ఇంట్లో నుంచి ప్రజలంతా బయటకు పరుగులు పెట్టారు.
ఈ భూకంపం ఎఫెక్ట్ బీహార్‌పై కూడా పడింది. బీహార్‌లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ముఖ్యంగా పాట్నా దాని పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనల వల్ల కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఏడాది హిమాలయన్ రీజియన్‌లో ఇప్పటి వరకు ఆరు భూకంపాలు వచ్చాయి. ఇందులో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కూడా ఉంది. ఈ ప్రకంపనల కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమవ్వగా.. వంద మందికిపైగా మృతి చెందారు.
నేపాల్ ఫాల్ట్ లైన్‌పై ఉండటం… ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్- యురేషియా ప్లేట్లోకి నెడుతుంది. దీంతో క్రమం తప్పకుండా భూకంపాలు వస్తున్నాయి. ఈ మధ్య వీటి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఈ భూకంపాల ఎఫెక్ట్ భారత్‌పై కూడా పడుతోంది. భూకంపం వచ్చిన ప్రతిసారీ ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రకంపనలు రావడం సర్వసాధారణంగా మారింది. ఈ భూకంపాల కారణంగా నేపాల్ ఇప్పటికే చాలా నష్టాన్ని చవి చూసిందనే చెప్పాలి. 2015లో నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది మరణించగా, 22 వేల మందికి పైగా గాయపడ్డారు.