గురువారం అమరావతిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమయ్యింది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ లోని సభా పక్ష నేత, ముఖ్యమంత్రి ఛాంబర్‌లో కాసేపు అధికార కార్యకలాపాలు, రాజకీయ చర్చలు కాకుండా.. ఆత్మీయ వాతావరణం నిండిపోయింది.
నాగం జనార్దన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ గురించి అవగాహన ఉన్న వాళ్లందరికీ ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు. అంతేకాదు.. తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన పొలిటికల్ లీడర్. ప్రస్తుతం క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే, ఒక్కసారిగా నాగం జనార్దన్ రెడ్డి.. ఏపీ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. అసెంబ్లీ లోని సభాపక్ష నాయకుడు, సీఎం చాంబర్‌లో కాసేపు ముఖ్యమంత్రితో ముచ్చటించారు. అయితే, అదేదో రాజకీయ సంబంధిత చర్చల కోసం కాదు. పదిహేడేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన ఓ కేసులో న్యాయస్థానానికి హాజరయ్యేందుకు వెళ్లిన నాగం జనార్దన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన మాజీ సహచరుడు చంద్రబాబు నాయుడుతో గౌరవ పూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు.. నాగం జనార్దన్ రెడ్డి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను ఆప్యాయంగా పలకరించారు. నాగం గారూ.. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారు? అంటూ ఆరా తీశారు. నాగం కుటుంబసభ్యుల యోగ క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నాగం జనార్దన్ రెడ్డికి చంద్రబాబు సూచించారు.
ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఉద్యమాలపై అప్పుడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా ఆ కేసులో ఉన్న మిగతా నాయకులతో పాటు.. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లి.. చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు.
ఆత్మీయ కలయిక నేపథ్యంలో ఇద్దరు నాయకులూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ తరపున చేసిన ప్రజా పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
నాగం జనార్థన్ రెడ్డి మనస్తత్వం గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. నాగం ఆ సమయంలో ఫైర్ బ్రాండ్‌గా ఉండే వారని, పార్టీ ఆదేశిస్తే చాలు.. దూసుకు పోయేవారని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశంసించారు. నాగం ఎంతో ఎమోషన్‌గా ఉండేవారని అప్పటి పరిణామాలను గుర్తు చేశారు.
ఇక, నాలుగో సారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు నాగం జనార్దన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని, తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలన్నది తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.