-
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి
-
సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి పంపండి
-
నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోండి
-
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి
-
ప్రజాస్వామ్యం, సభ సాంప్రదాయాలపై మాకు గౌరవం ఉంది
-
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈ సెషన్ మొత్తం ఆయన్ను సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.. స్పీకర్‌ను కోరారు. ఈ సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసి వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చర్చ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు.
నిండు శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చులకనగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. “మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నారే తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు” అని గౌరవ స్పీకర్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చులకనగా మాట్లాడటం బట్టీ చూస్తే వారు మిమ్మల్ని సభాపతిగా చూడటం లేదన్నారు. మీ స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతినే. గడ్డం ప్రసాద్ కుమార్‌ను సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూడటం బాధాకరమన్నారు.
శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఎల్ఫీ సమావేశం నిర్వహించి కెసిఆర్ ఇదే ఉద్భోధ చేశారా? అని ప్రశ్నించారు. వాళ్ల సంస్కారం చూస్తుంటే బాధగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలను సభలో సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. సభ సాంప్రదాయాలు కాపాడటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని ఉపముఖ్యమంత్రి అన్నారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ప్రకారం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొంత మంది సభ్యులు కోరారన్న భట్టి విక్రమార్క.. తమకు ప్రజాస్వామ్యం, సభ సాంప్రదాయంపై గౌరవం ఉందని స్పష్టం చేశారు.