ప్రజా నాయకుడు.. నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు అలానే అప్రకటిత ప్రజానేతగా.. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిలుస్తున్నారు. ప్రజలకు చేరువ కావడం.. వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచాక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో నెలకు మూడు నుంచి నాలుగురోజుల పాటు ఉంటున్నారు. ఇక్కడ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. సాయం చేస్తున్నారు. అభివృద్ది పనులు కూడా చేపడుతున్నారు. అంతేకాదు.. ఒక్క కుప్పమే అయితే.. భువనేశ్వరి గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అన్ని జిల్లాల ప్రజలను కలుస్తున్నారు. కృష్ణాజిల్లాలో తన తండ్రి గ్రామం నిమ్మకూరులో పాఠశాల నిర్మిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులను ఎంపిక చేసి.. వారికి స్కాలర్ షిప్పులు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టును మరింత బలోపేతం చేసి.. సమాజంలో అణగారిన వర్గాలకు ఆసరా చూపిస్తున్నారు. కేవలం స్వచ్ఛంద సేవకు భువనేశ్వరి పరిమితం కాలేదు. అవసరానికి తగిన విధంగా రాజకీయ అవతారం కూడా ఎత్తుతున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నపుడు నిజం గెలవాలి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఆ కార్యక్రమం ద్వారా మొదటి సారి జనబాహుల్యం అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం చిక్కింది.
గత ఎన్నికల్లో ఊరూ వాడా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా.. పీ4 పథకంపై ఆమె అంతర్గతంగా పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తున్నారు. వీరిలో మహిళా పారిశ్రామికవేత్తలను ఒప్పించే పనిలో ఉన్నారు. తద్వారా.. చంద్రబాబు ఆశయాలకు దన్నుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
భువనేశ్వరి రాజకీయ నేత కాకపోవచ్చు.. కానీ, అప్రకటిత ప్రజానేతగా గుర్తింపు పొందుతున్నారనడంలో సందేహం లేదు. ఇటీవల కుప్పం డిగ్రీ కాలేజీలో భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించిన ఆంశాలు భువనేశ్వరి పరిణతిని ప్రతిపలించాయి. ప్రతి పురుషుని సక్సెస్ మహిళతోనే ముడి పడి ఉంటుందన్నారు. ఏదీ ఫ్రీగా రాదు. కష్టంతోనే వస్తుంది. బాలికలకు పట్టుదల, ధైర్యం, నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, తర్వాత మరొకటి. రాజకీయాల్లో బిజినెస్‌లో నన్ను నేను లాక్కుని ముందుకు వెళ్ళాను” అని వెల్లడించారు. ముందు నందమూరి కుమార్తెను.. బాబు భార్య సెకండ్. ఫోకస్ పనిలో పెడితే ముందుకు వెళ్ళచ్చు. హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు హెరిటేజ్ చూసుకోమన్నారు. ఎండీగా బాధ్యతలు ఇచ్చారు.
నాన్నకంటే గొప్పవాడివి కావాలని లోకేష్‌కు చెపుతుంటాని వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇచ్చే భువనేశ్వరి… టీమ్ వర్క్‌తోనే విజయం సాధిస్తామని నమ్ముతారు. వ్యాపారం, ఉద్యోగం అన్నింటిలోనూ ఆడపిల్ల దేనిలోనూ తక్కువకాదని అంటారు.
క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు భువనేశ్వరి ఆసక్తి చూపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అన్న బాలకృష్ణ, చెల్లెలు దగ్గుబాటి పురుందేశ్వరి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. దీంతో ఆమెకు రాజకీయాలపై మరింత ఆసక్తి పెరిగింది. గత ఎన్నికలకు కొన్నాళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ఫోటో షూట్ చేశారని సమాచారం. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు భువనేశ్వరి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని వినికిడి. అయితే బిజెపికి ఆ సీటు కేటాయించటంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాబోయే రోజుల్లో పెద్దల సభలో అడుగుపెట్టి మహిళ సాధికారతపై వాణి వినిపించేందుకు భువనేశ్వరి సిద్దం అవుతున్నారు.