- తొక్కిసలాటలో అనేక మందికి తీవ్రగాయాలు
- సంగమ స్థలానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో ఘటన
- అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఘటన
- బారికేడ్లు విరిగిపోయి… స్పృహ కోల్పోయిన మహిళలు
- వెనకనుంచి నెట్టుకుంటూ రావడమే కారణం
మహాకుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకోవడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. తాజా పరిస్థితుల నేపధ్యంలో సంగమ స్థలం దగ్గర అఖాఢాలు, సాధు సంతులు, అఘోరాలు మౌని అమావాస్య పవిత్ర స్నానాలను రద్దు చేసుకున్నారు. తొక్కిసలాట ఘటనలో మరణాలు కూడా సంభవించి ఉండొచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాటలో 40 మంది కి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలం దగ్గరకి గత రాత్రినుంచే భక్తులు పోటెత్తడం మొదలు పెట్టారు. సంగమ స్థలానికి సరిగ్గా కిలోమీటరు దూరంలో ఒక్కసారిగా భక్తులు చొచ్చుకురావడంతో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది. అనేక మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.
వెనకనుంచి ఎవరో నెట్టేశారు…
సంగమ స్థలానికి స్నానంకోసం తామంతా నడుస్తున్నామని, హటాత్తుగా వెనక నుంచి ఎవరో గుంపు తోసుకుంటూ వచ్చిందని దాంతో తామంతా కింద పడిపోయామని, తమపై నుంచి తొక్కుకుంటూ వెళ్లిపోయారని ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ వాపోయింది.
అఘోరాలు, నాగసాధువుల నిర్ణయం
ఈ సంఘటనతో అఖాడాలు, నాగసాధువులు అమృతస్నానం చేయడం విరమించుకున్నారు. మరోవైపు లక్షల్లో భక్తులు ఇతర ఘాట్ లలో పవిత్ర స్నానాలు ముగించుకుని పితృ తర్పణాలు వదులుతున్నారు.
ప్రధాని ఆరా..
తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు స్నానం చేసి పితృ తర్పణాలు వదిలితే సకలపాపాలు హరిస్తాయని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళాలో ఇప్పటి వరకూ దాదాపు 20 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. మేళా ముగిసేలోగా 45 కోట్ల మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.