పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి చిత్రాడ వద్ద ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభా ప్రాంగణాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా స్థలిలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్, సౌండ్ లకి సంబంధించి కమిటీ సభ్యులతో చర్చించారు. వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ కి పలు సూచనలు చేశారు. ఆవిర్భావ సభకు హాజరయ్యే అతిధులను సమన్వయపరచడంపై కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు. ప్రాంగణంలో ఉండే అతిధులతోపాటు, సాంకేతిక, మెడికల్ బృందాలను, అధికారులు, కళాకారులను సమన్వయం చేసుకొంటూ వారికి అవసరమైన ఏర్పాట్లను చూసే బాధ్యతను పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ కు అప్పగించారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీతో కలసి ఆయన పని చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసన సభలో ప్రభుత్వ విప్ లు బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్ తదితరులు నాందెడ్లతో పాటు సభా ఏర్పాట్లను పరిశీలించారు.
- Advertisement with us -