రష్యాలో ఇప్పుడు కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్టు ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఈ వైరస్ ఏయే దేశాలకు విస్తరిస్తుందోననే భయం కూడా మొదలైంది. ఎందుకంటే కోవిడ్ తరహాలోనే ఈ వైరస్ వ్యాపిస్తోందంటూ కొన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు కథనాలు ప్రచురించడం ఇప్పుడు టెన్షన్ పెరుగుతోంది.
ఈ మిస్టరీ వైరస్ కారణంగా తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన దగ్గు వస్తుందన్న ప్రచారం ఉంది. కొంత మంది రష్యన్లు నెల రోజులుగా మందులు వాడుతున్నా తగ్గడం లేదని.. దీంతో ఏదో కొత్త వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. అయితే కోవిడ్ టెస్ట్‌లు మాత్రం నెగటివ్‌గా వస్తున్నట్టు చర్చ జరుగుతోంది. కొంతమందికి దగ్గు వచ్చినప్పుడు రక్తం కూడా పడుతుండటంతో ఈ కలకలం పెరిగింది. ప్రస్తుతం రష్యన్ సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ కథనాలపై రష్యా స్పందించింది. కొత్త వైరస్ వార్తలను ఖండించింది. కొంత మంది ఇబ్బంది పడుతున్న వాస్తవమే కానీ.. దానికి కొత్త వైరస్ కాదని.. శ్వాసకోశ వ్యాధులే దీనికి కారణమని తెల్చింది. అలెగ్జాండ్ర అనే మహిళ తాను దగ్గినప్పుడల్లా రక్తం వస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమెకు పరీక్షలు నిర్వహించినప్పుడు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్టు గుర్తించామన్నారు. అంతేకాదు ఒకవేళ ఏదైనా కొత్త వైరస్‌ను గుర్తిస్తే ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు రష్యన్ అధికారులు.