27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

హిందువుల కోసం ప్రాణాలిచ్చిన ముస్లిం యువకుడు

  • పహల్‌గాం ఉగ్రదాడిలో మరో కోణం

  • టెర్రరిస్టులను అడ్డుకున్న ముస్లిం యువకుడు

  • టూరిస్టులను చంపొద్దంటూ వాగ్వాదం

  • తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించిన హార్స్‌మెన్‌

  • ముస్లిం అని తెలిసి కూడా చంపేసిన దుర్మార్గులు

  • పర్యాటకులను గుర్రాలపై తీసుకొచ్చే వృత్తి

పహల్‌గాంలో పర్యాటకులకు పేర్లు అడిగి మరీ హిందువులనే దారుణంగా హత్యలు చేసిన ఉగ్రవాదులు.. ఓ ముస్లిం యువకుడిని కూడా అమానవీయంగా హత్య చేశారు. హిందువులనే చంపుతామంటూ చెప్పుకుంటూ చంపేశారని అందరూ చెబుతూంటే, ఈ ముస్లిం యువకుడిని ఎందుకు చంపేశారన్న అనుమానం రాక మానదు. అయితే, ఆ ముస్లిం యువకుడు.. పర్యాటకులుగా వచ్చిన హిందువులను రక్షించేందుకు తన ప్రాణాలిచ్చాడు.

ఉగ్రవాదులంటేనే మంచితనం, మానవత్వం వంటివేమీ ఉండవన్నది ఆ యువకుడికి తెలుసు. అందరి చేతుల్లో ఏకే 47 అత్యాధునిక తుపాకులు. వాళ్లను అడ్డగిస్తే తనను చంపేస్తారని తెలుసు. అయినప్పటికీ వాళ్లతో వాగ్వాదానికి దిగాడు స్థానిక హార్స్‌మెన్‌ సయీద్‌ హుసేన్‌ షా. తాను చెప్పినా వినకుండా కాల్పులు జరపడంతో ఓ దశంలో టెర్రరిస్టు దగ్గరున్న తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు హుసేన్‌ షా. అయితే, మరో ముష్కరుడు.. హుసేన్‌ షాకే గురిపెట్టి అతన్ని కాల్చేశాడు. దీంతో అక్కడున్న హిందువులతో పాటు.. ముస్లిం యువకుడు హుసేన్‌ షా కూడా కుప్పకూలి పోయాడు. ఇప్పుడు సయీద్‌ హుసేన్‌ షా మతాలకతీతంగా చేసిన వీరోచితం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఉగ్రదాడికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన సయీద్ :

సయీద్ హుసేన్ షా పర్యాటకుల కోసం గుర్రాలపై రైడింగ్ చేసే హార్స్‌మెన్‌. ఆ ప్రాంతానికి వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో.. పర్యాటకులను గుర్రాలపై తీసుకెళ్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ ఉగ్ర దాడి జరిగిన రోజు కూడా పర్యాటకులను పహల్గాం ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు సయీద్‌ హుసేన్‌ షా. అదే సమయంలో ఉగ్రవాదులు హిందువులను పేర్లు అడుగుతూ చంపేస్తుండటాన్ని గమనించాడు. ఉగ్రవాదుల దగ్గరికి ధైర్యంగా వెళ్లి వాళ్లను వారించాడు. చంపొద్దని బతిమిలాడాడు. పర్యాటకులంటే వాళ్లు మన కశ్మీర్‌కు వచ్చిన అతిథులని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. వాళ్లకేమీ తెలియదని ఇలా చంపేయొద్దని వేడుకున్నాడు. వాళ్లు అయినా వినకపోవడంతో కోపంతో.. ఒక ముష్కరుడి దగ్గరున్న తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ, హుసేన్‌షా ముస్లిం అని తెలిసి కూడా మరో టెర్రరిస్టు అతన్ని కాల్చేశాడు. దీంతో.. హుసేన్‌ షా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆ కుటుంబానికి తీరని లోటు :

వాస్తవానికి సయీద్‌ హుసేన్‌ పనిచేస్తేనే వాళ్ల ఇల్లు గడుస్తుంది. హార్స్‌మెన్‌గా పనిచేస్తూ తన తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ విషాద ఘటనతో సయీద్ తల్లి షాక్‌కు గురయ్యింది. శోకసంద్రంలో మునిగిపోయింది. పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో తన కుమారుడు చనిపోవడం గర్వంగానే ఉన్నా.. తమ కుటుంబానికి ఎవరు దిక్కు? అని సయీద్‌ తల్లి రోదించడం అందరినీ కలచి వేస్తోంది.

కొనసాగుతోన్న అన్వేషణ :

ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఇద్దరిని గుర్తించారు. వారిలో అదిల్ గురి, అషన్ 2018లో పాకిస్తాన్‌కు పారిపోయిన కాశ్మీరీలుగా నిర్ధారించారు. వారు ఇటీవల మరో నలుగురితో కలిసి మళ్లీ కాశ్మీర్‌లోకి చొరబడ్డారని అనుమానిస్తున్నారు. ఈ దాడికి పాకిస్తాన్‌ నుంచి ఏకే-47 తుపాకులు, మందుగుండు సామాగ్రి అందినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇక, ఉగ్రవాదులలో మరో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. దాడికి ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరిగా ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడించాయి. అనుమానితుల ఫోటోలు, స్కెచ్‌లు విడుదల చేసి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com