అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు ఎలాన్ మస్క్. ఇప్పుడీ జోడి అన్‌స్టాపబుల్ అనే చెప్పాలి. ట్రంప్ గెలుపు వెనక మస్క్ కష్టం ఉంది.. డబ్బు ఉంది.. చరిష్మా ఉంది.. తెలివి ఉంది.. బలగం ఉంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే ట్రంప్‌కు సంబంధించి ఏం చేసినా మస్క్ చాటుగా చేయలేదు. ఓపెన్‌గానే చేశారు. అయితే ట్రంప్ కోసం మస్క్ బాగానే డబ్బు ఖర్చు చేశారు. కానీ ఎంత అనేది ఇప్పటి వరకు ఓ లెక్క లేదు. కానీ ఇప్పుడీ లెక్క తేలింది. ట్రంప్ కోసం ఏకంగా రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని రిపోర్టులు చెబుతున్నాయి.
ట్రంప్ ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఇలా అన్ని తానే చేసింది పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఈ సంస్థే ట్రంప్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఆయన మీటింగ్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇలా ఏ టు జెడ్ అన్నీ ఈ సంస్థే చూసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యేందుకు రోడ్ మ్యాప్ వేసింది ఈ సంస్థే. అలాంటి మస్క్ ఈ సంస్థకు ఏకంగా 239 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. ఇది కేవలం నగదు రూపంలో మాత్రమే. ఇక వేరే రకంగా మరింత సాయం చేసినట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్‌కు కొన్ని వారాల ముందు 25 మిలియన్ డాలర్ల విలువైన మూడు చెక్కులు.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ పేరు మీద మరో 20 మిలియన్ డాలర్లు.. రిపబ్లికన్ అభ్యర్థులకు 12 మిలియన్ డాలర్లు.. ఇలా డాలర్ల వర్షం కురిపించాడు మస్క్. ఇలా అన్ని కలిపితే మన కరెన్సీలో లెక్కేసి చూస్తే 2 వేల కోట్లు ధారపోశాడు మస్క్.
ఇలా డబ్బులు ఖర్చు చేయడమే కాదు.. ట్రంప్ గెలుపులోనే తన గెలుపును చూసుకున్నాడు మస్క్. అతడికోసం తీవ్రంగా ప్రచారం చేశాడు. ఇక తన సోషల్ మీడియా ఎక్స్‌ను వాడాల్సినంతా వాడుకున్నాడు. అంతేకాదు కొన్ని పిటిషన్‌లపై సంతకాలు చేసిన వారికి ఏకంగా డబ్బులు పంచినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా తనకు చేతనైందంతా చేశాడు మస్క్. అందుకే ట్రంప్ తన క్యాబినెట్‌లో చోటిచ్చాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషిన్సీ బాధ్యతలను అప్పగించాడు.
మరి దీని వల్ల మస్క్‌కు లాభమేంటి? ఓ వ్యాపారస్థుడు పైసా లాభం లేనిది రూపాయి కూడా విదల్చడు కదా.. ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ట్రంప్ గెలవగానే మస్క్‌కు సంబంధించిన కంపెనీలు భారీగా లాభమపడ్డాయి. దీని వల్ల మస్క్ సంపద ఒక్క రోజులో 26 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మన కరెన్సీలో చెప్పుకుంటే 2 లక్షల 23 వేల కోట్ల రూపాయలు. మరి మస్క్ ఖర్చు పెట్టింది జస్ట్ 2 వేల కోట్లు మాత్రమే. అలా ఉంటాయి మస్క్ లెక్కలు.