తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో వేర్వేరుగా ట్వీట్లు చేశారు. అటు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు, ఇటు.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. వాళ్లను గెలిపించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఏపీలో ఎన్డీయే అభ్యర్థుల గెలుపుపై…
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడంపై మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ట్వీట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెస్పాండ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. అయితే, చంద్రబాబు ఎక్స్‌లో ఇంగ్లీష్‌లో ట్వీట్ చేయగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం తెలుగులో స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర గ్రాడ్యుయేట్ ఓటర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించారని, ఈ ఫలితాలు మన ప్రజానుకూల విధానాలకు, కుటమి ప్రభుత్వంపై పెరుగుతున్న నమ్మకానికి స్పష్టమైన ప్రజాభిప్రాయంగా పనిచేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలను అభినందిస్తున్నానని, వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మన కార్యకర్తలు, నాయకులు, ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని గెలుచుకున్న గాదె శ్రీనివాసులు నాయుడుని కూడా చంద్రబాబు ఎక్స్‌లో అభినందించారు. చంద్రబాబు పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు మోదీ. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని, రాష్ట్రం అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయితే, ప్రధాని మోదీ ట్వీట్‌కు మరోసారి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీయే పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నానన్నారు. ఎన్డీయే పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

తెలంగాణలో బీజేపీ విజయంపై…
ఇటు.. తెలంగాణలో జరిగిన ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. అందులో కరీంనగర్ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రముఖ విద్యావేత్త మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అటు ఉత్తర తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీతో దోబూచలాడింది. తీవ్ర ఉత్కంఠ నడుమ బీజేపీ అభ్యర్ధి ఉమ్మడి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయ బావుటా ఎగరేసారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం కావడంతో ప్రధాని మోదీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలతో పాటు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
“ఎంఎల్‌సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి తెలంగాణలో బీజేపీ పార్టీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.