ఏపీ రాజధాని నిర్మాణానికి గతంలోనే శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు మళ్లీ అమరావతిలో పునఃప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. గతంలో టీడీపీ హయాంలో మోదీ పిడికెడు మట్టి, చెంబు నీళ్లు తెచ్చిన ఘటనపై విస్తృతంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో నిధులపై ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే ఎదురవడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడం కూడా ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
ఇప్పుడు మరోసారి నరేంద్ర మోదీ, అమరావతి కాంబినేషన్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ నెల మూడో లేదా నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతికి వచ్చే అవకాశం ఉంది. అధికారికంగా తేదీ ఖరారు కాకపోయినా, ప్రభుత్వం మాత్రం సన్నాహాలు జోరుగా చేస్తోంది. ముఖ్యంగా అమరావతిలో నిర్మాణ పనులను మోదీ చేతుల మీదుగానే మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వెలగపూడి సమీపంలో, సచివాలయ వెనుకవైపు 250 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాకపోకలకు ఎనిమిది మార్గాలను గుర్తించి, వాటికి ప్రత్యేక అధికారులను నియమించి వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా పరిణామాలు చూస్తే.. మూడు రాజధానుల అంశం పూర్తిగా గతం అయిపోయినట్టే కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం స్పష్టంగా అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించిన తరువాత, వైసీపీ కూడా మూడు రాజధానుల ప్రణాళికను పక్కన పెట్టినట్లు భావిస్తున్నారు. ఇటీవల బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి సంకేతంగా నిలుస్తున్నాయి.
2015లో విజయదశమి సందర్భంగా నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపనకు హాజరైన సమయంలో ప్రజల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ, 2019లో ప్రభుత్వం మారిపోవడంతో అమరావతి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని తెరమీదకు తీసుకురావడంతో అమరావతి అంశం మరుగున పడింది.
అయితే, ఇప్పుడు పరిస్థితుల్లో మళ్లీ మార్పు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని మళ్లీ జోరందుకుంది. ఇప్పుడు మరోసారి మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణాలకు శంకుస్థాపన చేయించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఈసారి మాత్రం అమరావతి కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని సమాచారం. ఇందులో భాగంగా కొంత గ్రాంట్, మరికొంత అప్పుగా ఇవ్వనున్నారు. అయితే ఆ అప్పును కూడా తిరిగి అడగకుండా మాఫీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
ఇదే సమయంలో, బీజేపీకి పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేకపోవడం, టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో, కేంద్రం ఏపీకి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.