బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం స్థిరంగా ఉంది. చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో నైరుతీ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా పయనించి మరింత బలపడి తుపానుగా మారనుందని పేర్కొన్నారు.
రెండు రోజుల్లో శ్రీలంకను తాకుతూ తమిళనాడు తీరంలోని కరైకల్ మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉంది. 3 రోజుల్లో రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయన్నారు. 48 గంటలలో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ రోజు (గురువారం) నుంచి ఈనెల 30వరకు ఉత్తరాంద్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్య్సకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.