హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఎంఐఎం – బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ ఏర్పడగా, ఎలాగూ కావాల్సిన బలం లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రేసులో లేవు.
వాస్తవానికి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైనంత బలం లేకపోయినా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ప్రకటించినట్లుగానే.. నామినేషన్ల చివరి రోజు హైదరాబాద్ సెంట్రల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గౌతమ్ రావును అభ్యర్థిగా బరిలోకి దింపింది. హైదరాబాద్ స్థానిక సంస్థలు చూస్తే.. ఎంఐఎంకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే, బీజేపీ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది.
అయితే, ఈ ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటరీ పరిధిలోనే అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేక పోయారని రాజాసింగ్ ప్రశ్నించారు. సీనియర్ నేతల అభిప్రాయాలు పట్టించుకోక పోవడాన్ని రాజాసింగ్ తప్పుపట్టారు.
మరోవైపు.. ఎంఐఎం తరపున మిర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కార్పొరేటర్, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కలిగిన మిర్జా మరోసారి పోటీలోకి దిగారు. తమ విజయం ఖాయం అనే ధీమాను ఎంఐఎం వ్యక్తం చేస్తోంది.
ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉన్న వాళ్ల సంఖ్య 112. వీరిలో 81 కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. పార్టీల బలం పరంగా చూస్తే ఎంఐఎంకు 49 మంది మద్దతుదారులు, బీజేపీకి 25, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్కు 14 మంది సభ్యులు ఉన్నారు. అయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు బీజేపీ అభ్యర్థికి ఓటేస్తారన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. ఈఎన్నికకు పోలింగ్ ఏప్రిల్ 23వ తేదీన జరగనుంది.