22.6 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

ట్రంప్‌కు అమెరికన్ల నిరసన సెగ

అమెరికాలో వేలాది మంది రోడ్డెక్కారు. ఎందుకో తెలుసా? తమ అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి నష్టం కలిగిస్తాయంటూ స్వదేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో ‘హ్యాండ్స్‌ ఆఫ్‌’ పేరిట 150కి పైగా ప్రాంతాల్లో రోడ్లమీద జనం నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార శైలిపై, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై విదేశాల్లోనే కాదు.. స్వదేశంలో కూడా వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛలను హరించడం సహా ఇతర అంశాలపై ట్రంప్‌తోపాటు ఎలాన్‌ మస్క్‌ చర్యలపై అమెరికన్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వేల మంది నిరసనకారులు వాషింగ్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజిల్స్‌తో పాటు ఇతర ప్రదేశాల్లో ర్యాలీలు చేపట్టారు. స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేశారు. ‘హ్యాండ్స్‌ ఆఫ్’ పేరిట నిర్వహించిన ఈ నిరసనల్లో 150కి పైగా గ్రూపులుగా వేలమంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌరహక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్‌జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు కూడా ఉన్నారు.

రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డోనాల్డ్‌ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగాలేవని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్‌ యూఎస్‌ నాశనం చేస్తున్నారంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఒక పిచ్చివాడని.. అతని పిచ్చితో అమెరికాను ప్రపంచ మాంద్యంలోకి నెట్టబోతున్నాడని నినాదాలతో హోరెత్తించారు. దేశ ప్రజల అవసరాలతో పనిలేకుండా ట్రంప్ సర్కారు వ్యవహరిస్తోందంటూ ఆందోళన కారులు విమర్శించారు. కాగా.. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదని, భారీగా ఉద్యోగాల కోత కారణంగా అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్య, సామాజిక భద్రత, మెడికల్‌‌ ఎయిడ్‌, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు సహా ఏదీ సవ్యంగా లేవని మండిపడ్డారు.

అయితే, విదేశాల నుంచే కాదు.. స్వదేశంలోనూ ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్నప్పటికీ వైట్‌ హౌజ్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా దేశంలో నిరనసనలను తోసి పుచ్చింది. సోషల్‌ సెక్యూరిటీ, మెడికల్‌ ఎయిడ్‌లను డోనాల్డ్‌ ట్రంప్‌ రక్షిస్తారంటూ వైట్‌హౌజ్‌ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు.. అమెరికాలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌ – ఐఆర్‌ఎస్‌కు చెందిన 20వేల మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. ఇది దాదాపు 25 శాతంతో సమానమంటున్నారు. తొలుత పౌర హక్కుల కార్యాలయం నుంచి ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ఆఫీసును మూసేసి ఉద్యోగులను చీఫ్‌ కౌన్సిల్‌ ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విభాగం నుంచి గత ఫిబ్రవరిలో 7వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com