అమరావతిలో ఈనెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శాసన సభ్యుల అవగాహన సదస్సు వాయిదా పడింది. అనివార్య కారణాలతో ఈ సదస్సు వాయిదా పడినట్లు రాష్ట్ర శాసన సభా సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు శాసన సభ స్వరూపం, టెక్నికల్ టెర్మినాలజీ, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, రాజ్యాంగ పరమైన అంశాలు వంటి వాటిపై సవివరంగా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు దాదాపు ఆరు నెలల నుంచే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు ఇటీవలే ఢిల్లీ వెళ్లినప్పుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ ఎమ్మెల్యేల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. దీనికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఓకే చెప్పారు. కానీ, ఇప్పుడు సడెన్‌గా ఆ అవగాహన సదస్సును వాయిదా వేశారు. అనివార్య కారణాలని చెబుతున్నారు గానీ, స్పష్టంగా కారణమేంటన్నది బయటకు రాలేదు. అయితే, ఈ అవగాహన సదస్సు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదుపరి తెలియజేస్తామని మాత్రం ప్రకటించారు.
- Advertisement with us -