ప్రజా సమస్యలు, ఎత్తుగడలతో బిజీగా ఉండే రాజకీయనాయకులు కూడా మనుషులే. వారికి మనసు ఉంటుందని మరోసారి రుజువైంది. ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న ఆ చిన్నారి కథ విని భావోద్వేగానికి లోనయ్యారు.
శనివారం సిద్దిపేటలో పాఠశాల విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్తులో ఎదగాలి’ అనే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాత్విక అనే చిన్నారి మాట్లాడుతూ.. తాను పాఠశాలకు రావడానికి అమ్మే కారణం.. తాను రెండో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయాడని… అప్పటి నుంచి అమ్మే కష్టపడి చదివిస్తోందని వివరించింది. తాను ఊరికే అమ్మను తిడుతుండేదాన్ని. ఇక నుంచి మంచిగా చదువుకొని అమ్మకు మంచి పేరు తీసుకొస్తానని చెపుతూ కన్నీరుమున్నీరైంది.
చిన్నారి సాత్విక మాటలకు హరీశ్‌రావు కన్నీరు పెట్టుకున్నారు. సాత్వికను దగ్గరకు తీసుకుని సముదాయించారు.