కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీల ఎంపికలో ఎవరూ ఊహించని నేతలు తెరపైకి వచ్చారు. వారిలో విజయశాంతి ఎంపిక ఏ విధంగా జరిగిందనేది పార్టీ నేతలకు కూడా అంతుపట్టడంలేదు. విజయశాంతి ఎంపికలో ఎవరి ప్రభావం ఉంది… తెరవెనుక మంత్రాంగం నడిపింది ఎవరనే కోణంలో పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఫైర్‌బ్రాండ్ ఎంపికలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కీలక పాత్ర పోషించారని సమాచారం. మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ ఇద్దరు మహిళలు ఉన్నా మహిళా నేతలుగా ఎదగలేకపోయారని అధిష్టానానికి నివేదికలు అందాయి.
రాష్ట్రంలో మహిళలే మహరాణులు అని ప్రభుత్వం మహిళా లోకం కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్నా…వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇద్దరు మహిళా మంత్రులు విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోంది.
ప్రతిపక్షాలను నిలువరించి మహిళాలోకానికి ప్రతినిధులుగా వ్యవహరించే రాష్ట్ర స్థాయి నేతలు ఎవరు లేకపోవడం కాంగ్రెస్‌లో లోటుగా మారింది. దీంతో అధిష్టానం ఎమ్మెల్సీల ఎంపికలో పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చిన పేర్లన్నింటినీ పక్కనపెట్టేసి అనూహ్యంగా విజయశాంతి పేరు ప్రతిపాదించింది.
బీఆర్‌ఎస్,బిజెపిలు దూకుడుగా ఉన్న ఈ సమయంలో విజయశాంతి ఎంపిక పార్టీకి మేలు చేకూరుస్తుందని నాయకత్వం భావిస్తోంది. శాసనమండలి వేదికగా ప్రభుత్వ ఇమేజీ పెరిగేందుకు తోడ్పడుతుందని అంచనా. విపక్షంలోని రెండు పార్టీల నైజం తెలిసిన విజయశాంతి… వారి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతుందని భావిస్తున్నారు.
మరోవైపు విజయశాంతిని మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే సీతక్కకు చెక్ పెడతారా అని చర్చ జరుగుతోంది. సీతక్క ఫర్‌ఫార్మెన్స్ బాగాలేదని అందుకే విజయశాంతిని తీసుకున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సీతక్కతోపాటు కొండా సురేఖను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
అసలు కథ వేరే ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే వేం నరేందర్ రెడ్డిని తప్పించటం, సీతక్క పనితీరుపై చర్చ నిర్వహించటం స్కెచ్ ప్రకారమే జరుగుతోందని అంటున్నారు. విజయశాంతి మంత్రివర్గంలోకి రావటం జరిగితే సీతక్క లేదా కొండా సురేఖకు వేటు తప్పదు. అందులో ఎలాంటి అనుమానం లేదు.
అసలు విజయశాంతి ఎంపికలో మీనాక్షి నటరాజన్ పాత్ర ఎలా ఉంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎమ్మెల్సీ పదవి కోసం విజయశాంతి గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. మీనాక్షమ్మనే విజయశాంతిని ఢిల్లీకి వెళ్లి కలవమందని కొందరు నేతలు అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక… విజయశాంతి రాజకీయ పయనం పరిశీలిస్తే ఆమె ఎమ్మెల్సీ అయ్యాక అసలు అందుబాటులో ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయశాంతిని ఎంపిక చేసినా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం లేదు. పలుమార్లు పార్టీలు మారిన ఆమెను తమ నాయకురాలిగా గుర్తించటం లేదని వినికిడి.
ఎంపిగా పనిచేసిన విజయశాంతి రాష్ట్రస్థాయిలో మొదటిసారి చట్టసభల్లోకి వెళుతున్నారు. కెసిఆర్ మినహా బీఆర్‌ఎస్, బిజెపి నేతలు రాష్ట్రంలో ఆమెకు జూనియర్లే. ఎన్నికల సమయంలో విజయశాంతి పార్టీ విజయం కోసం సిన్సియర్‌గా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో గులాబీ, కమలంపై వాడి వేడి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆదే స్పీడు కొనసాగితే విజయశాంతి వీరవిహారం చేస్తుందనటంలో సందేహం లేదు.