మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణ దేవి సహిత విశ్వనాథస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు.. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా కాశీ విశ్వనాథుని ఆలయాలు తక్కువ సంఖ్యలో ఉంటాయని, బొడుప్పల్ లో ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలందరికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో యేళ్లుగా పూర్తి కాని ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. పదేళ్లుగా పూర్తి కాని సొంత ఇంటి కలను తమ ప్రజా ప్రభుత్వం హయాంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైనా, అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వర్గం సహచరులందరిపైనా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.