అమెరికా నిధులను ఎలా ఖర్చు చేయాలి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అనే దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక దేశాలకు అమెరికా అందిస్తున్న సాయాన్ని నిలిపివేశారు ట్రంప్. అంతేకాదు US AID అనే సంస్థ నుంచి ఏకంగా 9,700 మంది ఉద్యోగులను తొలగించేశారు కూడా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. అది కూడా అత్యంత పేద దేశాలైన ఆఫ్రికాలోనే ఎక్కువగా పనిచేస్తున్నారు ఈ సంస్థ ఉద్యోగులు.
సరే ఇప్పుడు విషయానికి వస్తే ఇలా ఆగిపోయిన సాయం విషయంలో భారత్ కూడా భాగమై ఉంది. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్ టర్నవుట్ అనే విభాగం పనిచేస్తోంది. దీనికి 21 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా చేసింది. ఇప్పుడా సాయాన్ని నిలిపివేశారు ట్రంప్. దీనిపై ఆయనే స్వయంగా స్పందించారు కూడా. భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయి.. మళ్లీ అమెరికా ఎందుకు ఇవ్వాలి. భారత్ విధించే టారీఫ్‌లు ఎక్కువే.. అక్కడ వసూలు చేసే పన్నులు కూడా ఎక్కువే. భారత ప్రజలన్నా.. భారత ప్రధాని నరేంద్రమోదీ అన్న నాకు చాలా గౌరవం ఉంది. కానీ వారి దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మనం ఎందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? అసలు మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఏంటి? అని క్వశ్చన్ చేస్తున్నారు ట్రంప్.
నిజానికి ఇది మంచి నిర్ణయమే. భారత్‌కు కూడా ఈ నిర్ణయంతో జరిగే నష్టం ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే భారత కరెన్సీలో చూసుకుంటే అమెరికా అందించే సాయం కేవలం 187 కోట్లు మాత్రమే. భారత్‌కు అదేమంత పెద్ద విషయం కాదు. అయితే అమెరికా ఆర్థిక సాయంతో లాభపడే చాలా దేశాలకు మాత్రం ఇది షాకింగ్ అనే చెప్పాలి.