- కొండెక్కి కూర్చున్న కనకం..
- అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 3,167డాలర్లు
- తులం బంగారం అక్షరాలా లక్షరూపాయలు దాటేసింది
- మెట్రో నగరాల్లో గ్రాము బంగారం రూ.10,150
- హైదరాబాద్ లో పదిగ్రాముల బంగారం రూ.1,02,062
- ఈరోజు రూ.1600 పైకి పెరిగిన బంగారం ధర
- అక్షయ తృతీయ కన్నా ముందే పెరిగిన ధరలు
- ఆరోజుకు మరింత పెరిగే ఛాన్స్
- కొనలేక మధ్యతరగతి గుండె గుభేల్
- మధ్య తరగతికి మోయలేని భారంగా పెళ్లిళ్లు
- ట్రేడ్ వార్ తో తలెత్తిన సంక్షోభం..
- ఇప్పట్లో తీరేలా లేదన్న బులియన్ మార్కెట్ నిపుణులు
- లాంగ్ టెర్మ్ గెయిన్స్ కు బంగారమే బెటర్ !!
వేసవి ఎండలకి మించి పెరిగిపోతోంది బంగారం ధర.. మండు వేసవిలో హై టెంపరేచర్ ఉష్ణోగ్రతలను బీట్ చేస్తూ నిన్న తులం లక్షకు చేరుకుంది పసిడి ధర… అక్షయ తృతీయ నాటికి వాస్తవానికి ఈ ధర లక్షకు చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ 9 రోజులు ముందే కనకం కొండెక్కి కూర్చుంది. ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది.అంతర్జాతీయంగా డాలర్ పతనం గోల్డ్ బలపడేందుకు కారణమైంది.
మధ్యతరగతిపై మోయలేని భారం
గ్లోబల్ మార్కెట్ల అనిశ్చితి,డాలర్ పతనం బంగారం ధర పైపైకి ఎగబాకేందుకు కారణమయ్యింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 3,167 అమెరికన్ డాలర్లు. దేశీయ మార్కెట్లో గ్రాము బంగారం ధర పదివేలకు చేరుకుంది. పది గ్రాములు అంటే తులం బంగారం ధర ఇప్పుడు లక్ష రూపాయలు పైనే .ప్రధాన నగరాలైన ఢిల్లీ,ముంబై, కొల్ కాతా, చెన్నై, హైదరాబాద్ లలో బంగారం ధరలు నిన్న సాయంత్రానికే భగ్గుమన్నాయి. బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం ఢిల్లీలో గ్రాము బంగారం ధర రూ. 10,150 కాగా ఇతర మెట్రో పాలిటన్ నగరాలైన ముంబై, చెన్నై, కొల్ కాతా, బెంగళూరులలో రూ. 10,135 ధర పలుకుతోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం తులం, అంటే పది గ్రాముల ధర రూ.1,02,062 గా ఉంది. ఈరోజు రూ.1600 పైకి పెరగడం విశేషం.
అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో భగ్గుమన్న బంగారం ధరలు వినిమయ దారులను మరింత కలవరపెడుతున్నాయి. ఈ దశలో పెళ్లి తలపెడితే ఖర్చులు భరించలేమని మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు, పబ్బాలు అన్నింటికీ తృణమో, ఫణమో బంగారం కొనాల్సిందే.ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో వధూవరులకు పెట్టి పోతలకు ఎక్కువ మొత్తంలో బంగారం కొంటారు. కానీ ఇప్పుడు బెంబేలెత్తిస్తున్న పసిడి ధరలు బిక్క మొహం వేసేలా చేస్తున్నాయి. కట్నం ఎంతున్నా, లేకున్నా.. కానుకలు మాత్రం ఘనంగా ఇవ్వాల్సిందేననే ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. దాంతో పెళ్లి చేయడం ఒక ఎత్తు, వధూ వరులకు బంగారం కొనడం ఒక ఎత్తులా మారిపోయింది. లక్ష రూపాయలకు మించి తులం బంగారం అంటే పదుల సంఖ్యలో, వందల్లో తులాలు పెట్టాలంటే ఇక మోయలేని, తూగలేని భారమే.
ఈనెల 30న అక్షయ తృతీయ.. ఆరోజు హిందువులు బంగారం కొనడం ఆనవాయితీ. అది తృణమో,ఫణమో చిన్నమెత్తు బంగారమైనా కొనడం సెంటిమెంట్. ఈ కాలంలో బంగారం కొంటే ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుందని, లక్ష్మీ దేవి ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుందని నమ్ముతారు. పైగా మహిళలకు బంగారంపై ఎడతెగని మక్కువ.. చెప్పలేనంత మోజు. కృత్రిమ డిజైన్లు, నగలు, డైమండ్, ఆభరణాలు ఎన్ని ఉన్నా.. మగువ మనసు ఎప్పుడూ బంగారం వైపే. మహిళలకి బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు, లేదా సంతానానికి,వారసులకు బంగారం పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కరిగించి, దానికి అదనంగా మరింత బంగారం కొని కొత్త వస్తువు, లేదా నగ తయారు చేయిస్తుంటారు. కానీ పెరిగిన బంగారం ధరలు నోట మాట రానివ్వడం లేదు.. పిల్లల పెళ్లిళ్లు చేయాల్సిన తల్లి దండ్రులు కొండెక్కిన కనకాన్ని చూసి దిగాలు పడిపోతున్నారు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు బంగారం కొనడం అన్నది కలలో కూడా ఊహించరు. అది వారి పరిధిలోని అంశమే కాదు.. అలాగే సంపన్నులకు బంగారం ధర ఎంత పెరిగినా నో ఫికర్..సంపన్న వర్గాలకు పెరిగిన ధరలు ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు.. ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా వారు తమ అవసరాలకు బంగారం కొంటుంటారు. పైగా అదనంగా బంగారం కొని దాచుకోవడం వారికి స్టేటస్ సింబల్ గా మారింది.
ఎటొచ్చి మధ్య తరగతి వారికే మోయలేని భారమై కూర్చుంది.కొనలేరు.అలాగని ఊరుకోలేరు.. తాహతుకు మించి బంగారం కొనడమంటే ఇప్పుడు వారికి చాలాచాలా కష్టం.. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలు ఈసారి వెలవెలబోతాయా? మధ్య తరగతి వారి ఇంట్లో శుభకార్యం కళా విహీనంగా మారుతోంది.
పసిడి ధరలెప్పుడు తగ్గుతాయ్…
ఇప్పటికే అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కాస్తా ట్రేడ్ వార్ గా మారిపోయింది. అమెరికా బోయింగ్ డెలివరీలను నిషేధించి చైనా పగ తీర్చుకుంటే ఆ దేశంపై మరిన్ని టారిఫ్ లు విధించి కౌంటర్ ఇచ్చారు ట్రంప్. ఈ ట్రేడ్ వార్ అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ ను అమాంతం పెంచేసింది.
అంతర్జాతీయ విఫణిలో ఔన్సు బంగారం ధర ఒక్క సారిగా ఎగబాకింది.దాంతో దేశీయంగా పసిడి ధర పైపైకి ఎగసి పడింది. ఇకపై ఈ ధరలు పైపైకే పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం లేదంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఈ యుద్ధం అంతకంతకూ పెరిగే అవకాశాలే ఉన్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్స్, షేర్లపై పెట్టుబడులు పెట్టడం కన్నా బంగారంపై పెట్టుబడి పెట్టడం ఉత్తమం అనే ఉద్దేశంతో ఉన్నారు ఇన్వెస్టర్లు. చాలామంది ఇప్పటికే తమ పెట్టుబడులను బంగారం కొనుగోళ్లపైకి మళ్లించారు. కాబట్టి సమీప భవిష్యత్తులో పసిడి ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చేసుకునే వారికి కొన్నవారికి కొన్నంత లాభం బంగారం..ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు,ఆర్ధిక మాంద్యం వచ్చినప్పుడు, మార్కట్ సంక్షోభం తలెత్తినప్పుడు బంగారమే ఎవరినైనా ఆదుకునే అస్త్రం..