25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

23న జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 23వ తేదీన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి ఏపీ అసంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను పవన్ కల్యాణ్‌ సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా ఇటీవలి కాలంలో అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శనకు కేరళ, తమిళనాడు వెళ్లారు. ఈ రెండు రాష్ట్రాల పర్యటన పూర్తయిన తర్వాత స్పాండిలైటిస్‌కు కేరళ వైద్య చికిత్స చేయించుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ కేరళ వైద్యం గురించి ఆరా తీశారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పంథా కాస్త భిన్నంగా ఉంటోందని, తన స్వభావం మారుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, కూటమిలో ఏకాభిప్రాయం రావడం లేదు. వైసీపీని బలహీనం చేసేందుకు నేతల్ని చేర్చుకున్నా.. వారిలో చాలా మంది కేసుల భయంతో వస్తారని.. కేసుల మాఫీ కోసం వస్తారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో కూటమి పార్టీల క్యాడర్ కూడా వైసీపీ హయాంలో హంగామా చేసిన వారిని చేర్చుకోవద్దని సోషల్ మీడియాలో బహిరంగంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేరికల అంశంపైనా ఎమ్మెల్యేలు , ఎంపీలతో పవన్ కల్యాణ్‌ మాట్లాడే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పక్షమే పోషించాల్సి ఉంది. కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తే విషయంలో ఏమరుపాటుగా ఉండాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పవన్ కల్యాణ్‌ ఇస్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ సభను మూడు వారాలకు పైగా నిర్వహించనున్నారు.

ఈ సమావేశాలకు వైఎస్‌ జగన్‌తో పాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే.. కనీసం లీవ్ లెటర్ పంపక పోతే అనర్హత వేటు వేసే అంశాన్ని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. దీనిపై పార్టీ స్టాండ్ కూడా పవన్ కల్యాణ్‌ అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల పనితీరుపైనా పవన్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధుల సమస్యలు, కూటమి పార్టీలతో సమన్వయం వంటి అంశాలపై విపులంగా పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com