-
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
-
బాధిత కుటుంబానికి రూ.9 కోట్లు చెల్లించాలన్న సుప్రీం
-
2009 జూన్ 13న ప్రమాదం
-
కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఢీకొట్టిన బస్సు
-
సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో మహిళ భర్త కేసు
-
రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో సుప్రీం తీర్పు
-
హైకోర్టులో సవాలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం
-
రూ.5.75 కోట్లకు తగ్గించి తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు
-
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన బాధిత మహిళ భర్త
-
ఇప్పుడు రూ.9 కోట్లు చెల్లించాలని సుప్రీం ధర్మాసనం తీర్పు
ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి 9కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. స్వదేశానికి వచ్చిన లక్ష్మి 2009 జూన్ 13వ తేదీన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి నాగళ్ల మరణించారు. దీంతో, తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్లు పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో అప్పుడే కేసు వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ట్రైబ్యునల్ లక్ష్మి కుటుంబానికి రూ.8.05 కోట్లు పరిహారం చెల్లించాలని 2014లోనే ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ మేనేజ్‌మెంట్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు.. బాధితురాలి కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.5.75 కోట్లకు తగ్గించింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పును మృతురాలి భర్త శ్యాం ప్రసాద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, అక్కడ శాశ్వత నివాసిగా ఉందని, నెలకు రూ.11,600 డాలర్లు సంపాదిస్తున్నారని శ్యాం ప్రసాద్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన భార్య మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్లు పరిహారం ఇప్పించాలని కోరారు. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించింది. బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. లక్ష్మి కుటుంబానికి రూ.9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.