ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు 120 రోజులు ఉన్న మెటర్నిటీ లీవ్ పరిమితిని 180 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ముఖ్యంగా, గతంలో ఉన్న “ఇద్దరు పిల్లలకు మాత్రమే మెటర్నిటీ లీవ్ వర్తింపు” అనే నిబంధనను కూడా పూర్తిగా తొలగించింది. దీంతో మహిళా ఉద్యోగులు ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చినా, ప్రతి సంతానోత్పత్తికి ప్రసూతి సెలవు పొందే హక్కు లభిస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మహిళలకు కూడా మెటర్నిటీ లీవ్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రొబేషన్‌లో ఉన్న ఉద్యోగినులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని అప్పట్లో గెజిట్ విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా జీవో విడుదల చేసిన ప్రభుత్వం, ఉద్యోగినుల శారీరక – మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీఎం చంద్రబాబు నాయుడు గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జనాభా వృద్ధిని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దీని కోసం ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ పెంపు, తల్లికి వందనం వంటి పథకాలు అమలులోకి తేవాలని నిర్ణయించారు. ఇకపై ఒక కుటుంబంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా, తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.