- రైళ్లు నిలిపివేతకు నయా కుట్ర
- బోగీల మధ్య కేబుల్ కట్
- దోపిడీ వేళ.. కానరాని జీఆర్పీ దళాలు
- అరగంటలో ఎపిసోడ్ ఖతం
నెల్లూరు జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు రైళ్లల్లోని బోగిల్లో చొరబడ్డ దొంగలు.. ప్రయాణీకుల దగ్గర బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట నుంచి -నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్యలో అల్లూరు రోడ్ రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య ఈ అరాచకం సృష్టించారు.
రెండు రైళ్లను నిలిపి మరీ.. చైన్ స్నాచింగ్ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం రైలు పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించారు. దీంతో మొదట చండీగఢ్ -మధురై ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. దాని వెనకనే మరో రైలు హౌరా బెంగళూరు ఎక్స్‌ప్రెస్ కూడా నిలిచి పోవడంతో బోగీల్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, విలువైన బ్యాగులు దోపిడీ చేసి పరారు అయ్యారు.
దుండగులే ట్రాక్‌పై సమస్యను సృష్టించి 20 నిమిషాలు నిలిపి వేశారు. ఎస్ 2, ఎస్ -4, ఎస్ -5 కోచ్‌లలోని మహిళల మెడలోని బంగారు నగలు దోపిడీ చేశారు. కేబుల్ కట్ చేయడంతో రైలు మళ్లీ పడుగుపాడు స్టేషన్‌లో ఆగిపోయింది. మరికొందరిపై దాడి చేసి బంగారు నగలు లాక్కుపోయారు. దీంతో ఒక్కసారిగా అర్థరాత్రి ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. ఈ సంఘటన కారణంగా 6 ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణం 25 నిమిషాలు ఆలస్యమైంది.
అరుపులు కేకలు వేసినా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల నుంచి స్పందన లేదని ప్రయాణికులంటున్నారు. రైళ్లలో భద్రత కరువైందని, నిఘా వ్యవస్థ లోపించిందని నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన రుజువు చేసింది.