ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు చనిపోగా ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. తాజాగా ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్ల మృతి చెందినట్లుగా భద్రత బలగాలు స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి ఎస్ఎల్ఆర్, బీజీసీ, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొనేందుకు బీజాపూర్, సుకుమా, దంతేవాడ జిల్లా నుంచి కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపుగా వెయ్యి మంది వరకు తరలి వెళ్లినట్లుగా సమాచారం. మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న సమాచారం మేరకు భద్రత బలగాలు అక్కడికి వెళ్లి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.