25 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

ఆ మూడు పథకాలకు భారీగా కోత – కేటాయింపులే లేని మూడు హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్భాటంగా మూడు లక్షల కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధాన పథకాలకు నిధులను భారీగా కోత విధించారు. ప్రధానంగా ఏపీలో అమలవుతోన్న పథకాలకు ఇప్పటికే పేర్లు మార్చిన ప్రభుత్వం గత యేడాది లబ్ది దారులకు చాలా వరకు మొండి చేయి చూపించింది. ఇప్పుడు కొత్తగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పటికీ.. ఈ బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపులు తగ్గించింది కూటమి ప్రభుత్వం.

ముఖ్యంగా ప్రజలకు ఆర్థికంగా ఎంతగానో ఆసరాగా ఉండాల్సిన పథకాలకు కేటాయింపుల్లో కోతలు పెట్టారు. వాటిలో ప్రధానంగా ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి నిధులు తక్కువగా కేటాయించారు. తల్లికి వందనం పథకం అమలు చేయాలంటే యేడాదికి రూ.12వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. కానీ, 2025-26 వార్షిక బడ్జెట్‌లో మాత్రం ప్రభుత్వం.. రూ.8,276 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక, గత యేడాది ఎలాగూ ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు ప్రకటించినా.. లబ్దిదారులకు మొండి చేయి చూపించింది.

మరోవైపు.. ‘దీపం’ పథకానికి కూడా కూటమి ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఇప్పటికే కోటి 55 లక్షల మంది లబ్దిదారులు ఉండగా, వారి సంఖ్యను 90 లక్షలకు కుదించింది. ఇక, నిధుల కేటాయింపులు చూస్తే.. దీపం పథకం అమలు చేసేందుకు రూ.4వేల కోట్ల దాకా నిధులు అవసరమైతే, కేవలం రూ.2601 కోట్లు మాత్రమే కేటాయించారు.

అటు.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం విషయంలోనూ ఇదే జరిగింది. ఈ పథకం కింద రైతులకు యేడాదికి రూ.20వేలు చొప్పున ఇస్తామని కూటమి సర్కారు హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు చేయడానికి దాదాపు రూ.10వేల కోట్లు అవసరమవుతాయి. కానీ, ప్రభుత్వం మాత్రం వచ్చే యేడాది బడ్జెట్‌లో కేవలం రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించింది.

మరోవైపు.. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు అయితే అసలు బడ్జెట్‌లో కేటాయింపులే చేయలేదు. అలాగే, డ్వాక్రా మహిళలకు కూడా బడ్జెట్‌లో ప్రభుత్వం టోకరా వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో ఆ హామీ ఊసే లేకుండా పోయింది. మరోవైపు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అంశంలోనూ క్లారిటీ లేదు. ఎందుకంటే.. ఉచిత బస్సు పథకానికి బడ్జెట్‌లో అసలు ఒక్క రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు. నిరుద్యోగులకు మూడువేల రూపాయల నిరుద్యో్గ భృతి హామీ కూడా అటకెక్కినట్లే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com