క్రిప్టో కరెన్సీ మోసాల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మంది ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ లకు పుదుచ్చెరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. భారీ ఎత్తున లావాదేవీలు జరిగిన క్రిప్టోకరెన్సీ మోసం కేసుకు సంబంధించి సినీ నటులు తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌లను ప్రశ్నించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.
మోసగాళ్ల సమూహం క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై అధిక రాబడిని వాగ్దానం చేయడం ద్వారా పెట్టుబడిదారులను మోసం చేసింది. ఈ కుంభకోణంలో ఒక్క పుదుచ్చేరికే చెందిన 10 మంది దాదాపు రూ.2.4 కోట్లు పోగొట్టుకున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. లాస్‌పేటకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అశోక్ అనే వ్యక్తి తనను కంపెనీ రూ.40 కోట్ల మోసం చేసిందని ఫిర్యాదు చేశాడు.
మొదట బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ద్వారా ఈ వ్యవహారం వెలుగు చూసింది. కపిల్ శర్మ షోలో పాల్గొన్న నేహా కక్కర్ తన ఆడంబరాలకు, విలాసాలకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడమే కారణమని బహిరంగంగా వ్యాఖ్యానించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేహా కక్కర్ ను అదుపులోకి తీసుకొని విచారించింది.
తాజాగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా పేరున్న తమన్నా, కాజల్ అగర్వాల్ పేర్లు ఈ వ్యవహారంలో వెలుగు చూశాయి. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో మరింత మంది సెలబ్రిటీలు ఉన్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.