23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

ఆస్తులు కరిగిపోయే తంతుగా పెళ్లిళ్లు!

  • సంప్రదాయం స్థానంలో ఆధునికత

  • అర్ధం లేని కొత్త ఒరవళ్లు.. అనవసరపు ఆర్భాటాలు

  • సంగీత్, మెహందీ అంటూ కొత్త హంగులు

  • ప్రీవెడ్ ఫోటో షూట్‌ లు అవసరమా?

  • వధూవరుల ఫోటో షూట్ కు అంత ఖర్చు చేయాలా?

  • ఈవెంట్‌ మేనేజ్ మెంట్‌ పేరుతో కొత్త ఉపాధి

  • డెకరేషన్ టీమ్స్ కు భారీగా పేమెంట్‌

  • మంటపాలు,స్టార్ హోటళ్లు,హాల్స్ కిటకిట

  • ఏ సీజన్ లోనైనా ఏసీ హాల్స్ బుకింగ్ కంపల్సరీ

  • మంటపం అలంకరణకే లక్ష, రెండు లక్షలు

  • కొత్తగా చేరిన రిటర్న్ గిఫ్ట్ కల్చర్

పెళ్లిళ్ల సీజన్ వచ్చే సరికి ఆడపిల్లలున్న తల్లి దండ్రుల గుండెలు గుభేల్మంటున్నాయి. లక్షలకు లక్షల ఖర్చు తప్పడం లేదు. ఆర్భాటాల జాడ్యం వదలడం లేదు. పెళ్లిళ్లకు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టడం ఒక సంప్రదాయంగా మారిపోతోంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా మధ్యతరగతిలో ఈ ఆర్భాటాలు, హంగామా ఒక అంటు వ్యాధిలా పట్టుకుంటున్నాయి. అప్పో సొప్పో చేసో..ఉన్న ఆస్తులన్నీ అమ్మో ఈ ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మధ్యతరగతి వారు కూడా ఓ పెళ్లి చేయలంటే కనీసం అరకోటి రూపాయలు ఖర్చవ్వాల్సిందే.

కట్నం వద్దు కానీ ఆర్భాటం కావాలి :

కాలం మారుతోంది.వరకట్నం సమస్య తీరింది.. ఆదర్శంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయ్ అనుకుంటుంటే.. కట్నానికి రెట్టింపు ఖర్చు చేసి కానీ వదలడం లేదు పెళ్లివాళ్లు.కట్నం పైసా అక్కరలేదు..పెళ్లి ఆర్భాటంగా చేయండి అన్న మాట వినడానికి సొంపుగా ఉన్నా కట్నానికి మించి ఖర్చవుతోంది. ఆడపిల్లలే కాదు మగపిల్లల తండ్రులూ గుడ్లు తేలేస్తున్నారు. ఇంత ఖర్చు చేసి పెళ్లి చేసినా ఆ పెళ్లిళ్లు మూణ్ణాల ముచ్చటగానే మిగులుతున్నాయి.

పెళ్లి కుదిరాక మొదలయ్యే మొదటి ఖర్చు ఎంగేజ్ మెంట్‌. ఏదో ఓ స్టార్ హోటల్ లేదంటే కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుని మరీ ఈ వేడుక జరుపుతున్నారు. వధూవరులిద్దరికీ పెట్టిపోతల గురించి మాట్లాడుకుని శుభలేఖలు అందించుకోడానికి ఉద్దేశించిన ఈ తంతు ఎంతలేదన్నా కనీసం లక్షా, రెండు లక్షలు వదిలిస్తోంది. ఎంగేజ్ మెంట్‌ సందర్భంగా పిల్లలిద్దరికీ పెట్టే ఉంగరాలు, తాంబూలాలు, బట్టలు, బంగారం గట్రా పెట్టడానికి ఈ తంతు జరిపినా, ఇప్పుడు కూడా ఆర్భాటంగా భోజనాలు పెడుతున్నారు. ఇదికూడా కేటరింగ్ సర్వీసే. కళ్లు మూసుకుని మినిమం ఓ లక్ష రూపాయలు ఇచ్చేయాల్సిందే.. ఇంకా కాస్త స్తోమతు ఉన్నవాళ్లయితే స్టార్ హోటల్‌ లో ఎంగేజ్ మెంట్‌ ఫంక్షన్ కోసం అందంగా ఫుడ్ మెటీరియల్ నుంచి బొకేల వరకూ అలంకరణకే లక్షలు వసూలు చేస్తున్నారు.ఎక్కడా బేరసారాలుండవు.. పేమెంట్‌ ఆన్ లైన్ లో జరిగిపోవాల్సిందే.కాంట్రాక్ట్ కుదిరితే..మధ్యతరగతి వారు ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ జరపాలంటే ఐదు లక్షలు ఖర్చు చేయాల్సిందే.

ఇక పాతకాలంలో పెళ్లివేడుకలు ఐదు రోజుల పాటు జరిగేవి..కానీ పెద్దగా ఖర్చు ఉండేది కాదు. సంప్రదాయంగా ఇళ్లలోనే చలువ పందిళ్లలో ఐదు రోజుల వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు మెహందీ ఫంక్షన్ అని కొత్త మోజు మొదలైంది. దీనికోసం ఓ స్టార్ హోటల్‌, లేదా ఓ ఫంక్షన్ హాల్‌ బుక్ చేయాల్సిందే. సంగీత్ వేడుక పేరుతో రాత్రంతా ఆడిపాడి, డ్యాన్సులు,మందు పార్టీలు వధూవరుల డాన్సులు వాటి వీడియో రికార్డింగులు.. ఇలా కనీసం ఓ రెండు లక్షలు ఆవిరైపోవాల్సిందే.
ఇక పెళ్లి జరిపే మండపం రెంట్‌ రెండు లక్షలు, అందులో మంటపం డెకరేషన్ కు ఈవెంట్ మేనేజర్ల రంగ ప్రవేశం.. ఈ డెకరేషన్ ఒక ప్రొఫెషన్ గా మారాక ఎక్కడలేని ఫ్యాన్సీ పూలతో అందంగా అలంకరణలు రొటీన్ అయిపోతున్నాయి. దీనికోసం రెండు, మూడు లక్షలు ఖర్చవుతోంది.

ప్రీవెడ్‌ ఫోటో షూట్‌ :

ఎంగేజ్మెంట్ తో మొదలయ్యే ఫొటోగ్రఫీ పెళ్లి చివరి ఘట్టం వరకూ ఒకే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. ఇక ప్రీవెడ్‌ ఫోటో షూట్‌ మోజు ఒక జబ్బులా అంటుకుంటోంది. పెళ్లికి ముందు రకరకాల ఫోజుల్లో వధూవరుల ఫోటోలు, వీడియోలు షూట్ చేయడం ఫ్యాషనైపోయింది. మరికొందరు సినిమా పాటలకు వారి హావభావాలను, డాన్సును రికార్డు చేసి అదో అందమైన కావ్యంలా మలుస్తున్నారు. ఈ క్రేజ్ రెండు, మూడు లక్షలు ఖర్చు తినేస్తోంది.

భోజనం :

పూర్వకాలం చక్కగా సంప్రదాయంగా గాడిపొయ్యి తవ్వి వంటగాళ్లను పెట్టి శాస్త్రోక్తంగా అరిటాకు భోజనాలుండేవి. ఇప్పుడు అంతా కాంట్రాక్టే. కనీసం వంద, రెండు వందల వెరైటీల ఐటెమ్స్ తో భోజనం పెడుతున్నారు. ప్లేట్‌ రెండొందలనుంచి వెయ్యి,రెండు వేల వరకూ ఉంటోంది.భోజనం తర్వాత తాంబూల సేవనం కూడా హైలైటే.. రకరకాల ఐస్ క్రీమ్స్ దానికి తోడు స్వీటులు ఓ ఐదారు రకాలు మినిమం పెడుతున్నారు. ఇవన్నీ కలిపి తడిసి మోపెడవుతోంది. కనీసం ఐద లక్షలు దాటుతోంది.
రిటర్న్ గిఫ్ట్ కల్చర్ః పాతకాలం పెళ్లిళ్లలో పెళ్లికి వచ్చిన వారికి దూరపు చుట్టాలకు బ్లౌజ్ పీస్, ఓ స్వీట్ పాకెట్, తాంబూలం ఇవ్వడం, దగ్గరి చుట్టాలకు బట్టలు పెట్టడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఈ సంప్రదాయానికి అదనంగా వచ్చి చేరింది రిటర్న్ గిఫ్ట్ కల్చర్.పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించి గిఫ్టులిచ్చేవారికి వెళ్లేటప్పుడు ఘనంగా ఏదో ఓ వస్తువు ఇచ్చి పంపడం పరిపాటిగా మారింది. అందులో కూడా వెరైటీ, ఇన్నోవేటివ్ నెస్ కు పెద్ద పీట వేస్తున్నారు.పెళ్లి ఖర్చులకు తోడు ఇది ఓ రెండు లక్షలు అదనం.

బ్యాండు మేళం :

ఇక బ్యాండుమేళం లేదా బాజా భజంత్రీల ఖర్చు కూడా కనీసం లక్షరూపాయలకు తక్కువ లేదు. వాద్యకారులకు యూనీఫామ్, రిచ్ లుక్ వేషధారణ అదనపు హంగులు.. ఈ హంగు ఆర్భాటాల కోసం బ్యాండ్ మేళం రేటు పెంచేశారు.

పెళ్లికి వచ్చి వెళ్లేవారికి వాహన సౌకర్యం కల్పించడం కూడా మర్యాదల్లో భాగంగా మారింది. దీనికోసం లక్ష రూపాయలు ఆవిరైపోవాల్సిందే. ఎంగేజ్ మెంట్‌, మెహిందీ, సంగీత్‌ ఫంక్షన్ కు వచ్చే వారికి కూడా అతిధి మర్యాదలు చేస్తే ఇక ఈ భారం మరింతగా మారుతోంది.

ఇక పెళ్లి బట్టల ఖర్చు నషాళం అంటిపోతోంది. రకరకాల ఈవెంట్లు పెళ్లి ఘట్టంలో భాగం చేయడం వల్ల ఈవెంట్ కు నచ్చినట్లు డ్రెస్సింగ్, స్టైల్‌, చివరకు పాదరక్షలతో సహా మార్చుతూ వధూవరులు హీరో హీరోయిన్లలా తళుకులీనాల్సిందే. ఎంగేజ్ మెంట్‌, మెహందీ, సంగీత్‌, పెళ్లి, ఆపై రిసెప్షన్ ఇన్ని ఘట్టాలకు ఇన్ని వేర్వేరు రకాల దుస్తులు, వాటి యాక్సెసరీస్.. ఇవన్నీ ఒక్క వధూవరులు, వారి తల్లిదండ్రుల బట్టలే ఐదారు లక్షలు ఖర్చవుతున్నాయి.

పెట్టిపోతలు :

వధూవరులకు పెట్టిపోతల ఖర్చు లక్షలే.. అమ్మాయికి పెట్టే బంగారం, అబ్బాయికి ఇచ్చే కట్నకానుకలు, అన్నీ కలసి 15 లక్షలు దాటుతున్నాయి.
రిసెప్షన్ః పెళ్లి వేడుకలో చివరి ఘట్టం రిసెప్షన్. పెళ్లి తర్వాత ఆడపెళ్లి వారు వారి ఇంట, మగపెళ్లి వారు వారి ఇంట రిసెప్షన్ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఈ రిసెప్షన్ కి మళ్లీ ఇంత ఘనంగానూ అతిధి మర్యాదలు, భోజనాలు, ఆత్మీయస్వాగతాలు, ఈవెంట్ మేనేజర్ల హంగామా తప్పనిసరి.. దీనికోసం ఎంత లేదన్నా ఐదారు లక్షలు మంచినీరులా ఖర్చవ్వాల్సిందే.

ఇంత జరిగాక అన్నీ బాగుంటే సరేసరి.. వధూవరులకు సమన్వయం కుదరకపోతే ఆ పెళ్లి కాస్తా పెటాకులైపోతోంది.. పూర్వకాలపు పెళ్లిళ్లలో మమతలు, ఆప్యాయతలు, సంప్రదాయాలు,ఐక్యత, ఆత్మీయత ఉండేవి. కానీ ఇప్పుడు ఆధునికత, ఆర్భాటాలు, హంగులు పెరిగి లేని కొత్త సంప్రదాయాలను అంటించుకుని ఫ్యాషన్, స్టైల్‌ పెంచి అర్ధం లేని హంగామా ఖర్చులా ఆర్భాటపు మేళంలా తయారైపోయాయి. ఓ మధ్యతరగతి తండ్రి ఘనంగా పెళ్లి చేయాలంటే అరకోటి సొమ్ము హారతి కర్పూరంలా కరిగించాల్సిందే. హారతి పళ్లెం సమర్పించుకోవాల్సిందే. పైన చెప్పిన ఖర్చుల్లో కనీసం30 లక్షలు వృథా ఖర్చులే.. పెళ్ళిళ్ల వ్యవస్థ ఎందుకిలా మోయలేని భారంగా మారిపోతోంది? వీటిలో సగం ఖర్చులు తగ్గించుకోలేమా?

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com