కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణస్వీకారం చేశారు. జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన మార్క్.. ఇప్పుడు ట్రేడ్ వార్ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి కెనడా ఆర్థిక పరిస్థితిపై దాడి జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఓ ఆర్థికవేత్తకు పగ్గాలు అప్పగించడమనేది లిబరల్ పార్టీ ముందు చూపు అనే అనుకోవాలి.
ప్రస్తుతం కార్నీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఓ వైపు అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతూనే.. మరోవైపు ఎన్నికలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. కెనడాలో మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈలోపే ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొనాల్సి ఉంటుంది.
బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలా కీలక వ్యాఖ్యలు చేశాడు కార్నీ. అమెరికా వెనక్కి తగ్గేవరకు తాము విధించిన టారీఫ్‌లను తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. ఫ్రీ అండ్ ఫేర్ ట్రేడ్ డీల్ జరిగే వరకు తమ పోరాటం ఆగదని.. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు వెళితేనే ఇరు దేశాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు కార్నీ.