అభివృద్ధి పేరుతో బీఆర్ ఎస్ హయంలో అనేకమైన అక్రమాలు జరిగాయని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర రుణాలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క….ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పులు, గత ప్రభుత్వం హయంలో అప్పుల వివరాలు వెల్లడించారు.
రాష్ట్రానికి ఉన్న రుణ భారం ప్రజలకు తెలియచేసేందుకు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. లేనిది ఉన్నట్టుగా చెప్పటం బీఆర్ ఎస్ కు అలవాటైందని విమర్శించారు. శ్వేత పత్రంలో అన్ని వివరించినా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉందని, రాష్ట్రానికి ఉన్న అప్పులకు తోడు ఉద్యోగులు, కాంట్రాక్టు పనులు, ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బిల్లులు పెండింగ్ లో పెట్టారని వెల్లడించారు. అప్పులతో పాటు బకాయిలు అప్పచెప్పారని బీఆర్ ఎస్ పాలనపై మండిపడ్డారు.
ప్రజాప్రభుత్వంపై శాసనసభలో, వెలుపల బీఆర్ ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్నిసార్లయినా లెక్కలతో సహా వివరించేందుకు సిద్దంగా ఉన్నట్టు ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.