25.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

మన్మోహనుడి విజయాల పరంపర…

మహనీయుని పథంలో పడిన అడుగులివి…

భారత ఆర్థిక రంగాన్ని తన సంస్కరణలతో  ముందుకు నడిపించిన సమర్ధత మాజీ ప్రధాని మన్మోహన్ ది.. ఆయన ప్రభుత్వ హయాంలోనే కీలకమైన ఆర్ధిక సంస్కరణలు అమలు చేసింది. సరళీకృత ఆర్థిక విధానాలు మాత్రమే కుదేలైపోయిన భారత్ కు ఊపిరినిస్తాయని, సరైన ట్రాక్ లో పెడతాయని ఆయన నమ్మారు. తన  అపార అనుభవాన్ని రంగరించి ఆయన ఈ విధానాలను రూపొందించారు. విదేశీ ప్రత్యక్ష నిధులకు తలుపులు బార్లా తెరిచారు. బహుళ జాతి కంపెనీలను పెట్టుబడులు పెట్టడంటూ ఆహ్వానించారు. భారత ఎగుమతులు, దిగుమతుల సుంకాలలో రాయితీలు, రిబేట్లు ఇస్తూ  ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని ముమ్మరం చేశారు. ఇది బాగా పనిచేసింది. దేశం సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఓ కొత్త వాతావరణాన్ని చూసింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా గాడిలోకి వచ్చింది. విదేశాల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకు రాగలిగామంటే  అది మన్మోహన్ తెలివి తేటలవల్లే పీవీ అలా చేయగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ గర్వంగా చెప్పుకుంటున్న విజయాలన్నీ ఆ నాటి చట్టాల ద్వారా అమలవుతున్నవే. ముఖ్యంగా 1991లో  ఆర్థిక సంస్కరణలు మన దేశ గతినే మార్చేశాయి.

అనేక చట్టాల రూపశిల్పి కూడా మన్మోహనే. అది కేబినెట్ సమష్టి నిర్ణయమే అయినా… వాటి సృష్టి, అమలు వెనుక మాస్టర్ బ్రెయిన్ మాత్రం ఆయనదే. ఓరకంగా చెప్పాలంటే ఆ చట్టాలన్నీ ఆయన మానస పుత్రికలనే చెప్పాలి. ఎందుకంటే భారత ఆర్థిక రంగాన్ని ఔపోసన పట్టిన మహర్షి మన్మోహన్. రోగం నయం చేయడానికి కాదు.. దాని మూలానికి మందు వేయాలని భావించిన డాక్టర్. అందుకే మన దేశ పరిస్థితులు, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. దేశ భవితవ్యాన్ని మలుపు తిప్పే కీలక చట్టాలకు ఆద్యుడు ఆయనే.. మచ్చుకు కొన్ని…

సమాచార హక్కు చట్టం :

ఈరోజు సామాన్యుడు సైతం దేశ పాలనపై విస్తృతమైన అవగాహనతో ఉన్నాడని, విజిల్ బ్లోయర్ల సంఖ్యపెరిగిందని  గర్వంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఆద్యుడు ఆ మౌన ముని మన్మోహనే. 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టంతో ఈరోజు ప్రభుత్వాల్లో అవినీతి బాగోతాలను పెకలించగలుగుతున్నాం. ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలుగుతున్నాం. విదేశాంగ విధానం, వాణిజ్యం కొత్తపుంతలు తొక్కింది. ఆయన ప్రభుత్వ హయాంలోనే ఎన్నో విప్లవాత్మక చట్టాలు వెలుగు చూశాయి.

నరేగా చట్టం :

ఇప్పుడు మనం గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా చెప్పుకునే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ చట్టం (నరేగా చట్టం) తెచ్చింది కూడా ఆయన సర్కారే.

మలుపు తిప్పిన న్యూక్లియర్ డీల్ :

2008లో భారత, అమెరికా దేశాల మధ్య సివిల్ న్యూక్లియర్ డీల్ అత్యంత ప్రధానమైనది. భారత ఆర్థిక అవసరాలకు ఆ ఒప్పందం చాలా కీలకం. అమెరికా సహకారంతో పౌర అవసరాలకు అణు విద్యుత్ తయారు చేసుకునే ఒప్పందమది. రెండు దేశాల మధ్య అవగాహన కారణంగానే మనదేశంలో అనేక అణు విద్యుత్ కేంద్రాల స్థాపన, నిర్వహణ సాధ్యమైంది. ఇది ఇంధన రంగానికి ఊపిరి పోసింది. అణు విద్యుత్ ని పౌర అవసరాలకు వినియోగించడం మన జీడీపీకి కూడా దోహదం చేసింది.

విద్యా హక్కు చట్టం :

అలాగే 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కుచట్టం నిరక్ష రాస్యతను తొలగించడానికి పిల్లలను బడికి పంపాలన్న ప్రభుత్వాల ఉద్దేశాలను తల్లిదండ్రులు అర్ధం చేసుకోకపోవడం పిల్లలను బడికి బదులు పనికి పంపడం వల్లనే అక్షరాస్యత పెరగడం లేదన్న పరిశోధనలను గుర్తించి చదువుకోవడం ఒక హక్కుగా చేసింది యూపీఏ ప్రభుత్వం. అదే విద్యా హక్కు చట్టం. పిల్లలకు చదువుకునే హక్కును కల్పించిన ఈ చట్టం ద్వారా కొంత వరకూ లిటరసీ రేట్ పెరిగిందనే చెప్పాలి.

 జాతీయ ఆహార భద్రతా చట్టం :

ఇక 2013 లో  చేసిన జాతీయ ఆహార భద్రతా చట్టం కూడా మన్మోహన్ సంస్కరణలలో కీలకమైనదే. అందరికీ నాణ్యమైన ఆహారం అందాలని చేసిన ఈ చట్టం వల్ల ఆహార భద్రత, నాణ్యత గణనీయంగా మెరుగు పడింది. ఆహారం తయారీ, స్టోరేజ్, పంపిణీ, అమ్మకాలు అన్ని రంగాల్లోనూ ఒక నిరంతర పర్యవేక్షణ ఉండే ఈచట్టం వల్ల ఆహారం వృధా కాదు. అలాగే విదేశీ ఆహార దిగుమతులపైనా ఒక నిఘా ఉంటుంది. దీనివల్ల ఆహార నాణ్యత గణనీయంగా మెరుగు పడి విదేశాలకూ మన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. భారత్ ప్రోడక్ట్ అంటే ఒక నమ్మకం కలిగేలా చేసిందీ చట్టం.

 జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ :

ఇప్పుడంటే  గ్రామాల్లోకి వైద్యసేవలు విస్తృతమయ్యాయి. కానీ ఒకప్పుడు ఆస్పత్రులే లేని పల్లెటూళ్లు కోకొల్లలు.. నాటు వైద్యం పై ఆధారపడి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్లే అధికం. జీడీపీ వృద్ధి రేటుకు ఆరోగ్యవంతమైన పౌర సమాజం కూడా కీలకమేనని గుర్తించిన మన్మోహన్ గ్రామాల్లో వైద్య సేవలను పటిష్టం చేయడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ను తీసుకొచ్చారు. దీనివల్ల సగటు ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

గోల్డెన్ క్వాడ్రాంగిల్ :

స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం తమ సృష్టి అన్నట్లు ప్రచారం చేసుకుంటుంది కానీ వాస్తవానికి ఈ కాన్సెప్ట్ కి ఊపిరులూదింది కూడా మాజీ ప్రధాని మన్మోహనే. సుస్థిర సాంకేతిక అభివృద్ధికి కీలకమైన మౌలికవనరుల కల్పన ప్రాజెక్టులను ప్రారంభించింది అప్పటి యూపీఏ ప్రభుత్వమే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా సువిశాల దూర తీరాలను కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. వేగవంతమైన ప్రయాణానికి, రోడ్ల కనెక్టివిటీ, వాణిజ్యం కొత్త పుంతలు తొక్కడానికి కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇది కారణమైంది. ఏపీ కోస్తాతీరంలో సాగర్ మాల లాంటి ప్రాజెక్టులకు బీజం పడింది దీనివల్లనే.

పటిష్టమైన విదేశాంగ విధానం :

వీటన్నింటి కితోడు పటిష్టమైన విదేశాంగ విధానం అమలు కూడా మన్మోహన్ పాలనకు వన్నెతెచ్చింది. ఇండో రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కింది. మన దేశం కూడా పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పరచుకోడానికి ఇది దోహదపడింది. అలాగే పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ లతో  బంధాలు బలపడ్డాయి. సార్క్ సదస్సుల్లోనూ, పర్యావరణ పరిరక్షణ సమావేశాల్లోనూ మన దేశం ఇమేజ్ పెరిగింది. పాకిస్థాన్ కుయత్నాలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడంలో ఫెయిల్ అయ్యారనే  విమర్శలున్నాయి. యూపీఏ ప్రభుత్వం మెతక వైఖరి వల్లనే ఉగ్రవాదం పెచ్చరిల్లిందన్న వ్యాఖ్యలున్నాయి. పాకిస్థాన్ పై కఠినచర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం వల్లనే ఏ ప్రభుత్వంలోనూ జరగనన్ని ఉగ్రదాడులు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి.

అధిక జీడీపీ వృద్ధిరేటు :

భారత్ ప్రపంచ పటంలో నమ్మకమైన, పటిష్టమైన, సమర్ధమైన, సుస్థిరమైన దేశంగా నిలబడటానికి కారణం   ఆనాడు పడిన పునాదే. ఈ అన్ని చర్యలను ఏకకాలంలో ట్రాక్ పైకి తీసుకురవడం వల్లనే జీడీపీ వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఆనాడు సాధించగలిగాం. ప్రపంచం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న టైమ్ లో కూడా మన్మోహన్ తొలి ఐదేళ్ల పరిపాలనలో జీడీపీ వ్రుద్ధిరేటు 7.9 సాధించగలిగారు. ఆ తర్వాత కాలంలో అది క్రమేణా తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com