తమ కుటుంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి తాను ఎటువంటి ప్రతికూల చర్యలకు దిగకుండా సంయమనంతో ఉంటానని మంచు మనోజ్ రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వద్ద బైండ్ ఓవర్ అయ్యారు. గడచిన మూడు రోజులు జల్ పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు ఇంటివద్ద కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో మంగళవారం రాచకొండ సీపీ మంచు మోహన్ బాబు ఆయన కుమారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ బుధవారం రాచకొండ సీపీ ముందు హాజయ్యారు. ఈ సందర్బంగా కుటుంబ గొడవలకి సంబంధించి సీపీ మంచు మనోజ్ నుంచి వాగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలు శాంతిభద్రతల సమస్యగా మారకూడదని, ఇరువర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ మనోజ్ కు సూచించారు. మీ కుటుంబ వివాదాలు ఇతరుల శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని మరో సారి ఇటువంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మనోజ్ ని రాచకొండ సీపీ హెచ్చరించారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు విడిగా హాజరయ్యారు. కమిషనర్ కు తన వాదనలు వినిపించి తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఆయనకు సమర్పించారు. అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అని కమీషనర్ విష్ణుకు చెప్పారు.