- మోహన్‌బాబు యూనివర్శిటీలోకి మనోజ్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు
- యూనివర్శిటీలోకి వెళ్‌లకుండానే నారావారిపల్లెకు వెళ్లిపోయిన మంచు మనోజ్
నటుడు మోహన్ బాబు కుటుంబానికి కంట్లో నలుసులా తయారయ్యారు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్. సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీలో ప్రతియేటా వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కుటుంబంలో విభేధాల కారణంగా కేవలం మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణులు మాత్రమే యూనివర్శిలో జరుగుతున్న వేడుకలకు హాజరయ్యారు. అయితే మంగళవారం తాను తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నట్లు మోహన్ బాబు యూనివర్శిటీని కూడా సందర్శించనున్నట్లు మంచుమనోజ్ ఓ షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో మోహన్‌బాబు యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. తన చిన్నకుమారుడు మనోజ్ యూనివర్శిటీలోకి వస్తే అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయని మోహన్ బాబు కోర్టులో ఇంజెక్షన్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు మంచు మనోజ్ యూనివర్శిటీలోకి వెళ్ళవద్దని ఆదేశించింది. అయితే మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలసి మోహన్‌బాబు యూనివర్శిటీ వద్దకు తన సెక్యూరిటీ సిబ్బందితో కలసి వెళ్లారు. యూనివర్శిటీకి ఉన్న నాలుగు ద్వారాల వద్దకు వెళ్లి పోలీసులతో మాట్లాడుతూ తన సిబ్బందితో వీడియో తీయించుకున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్శిటీలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని పోలీసులు మనోజ్‌ని అడ్డుకుని అక్కడ నుంచి వెనక్కి పంపించేశారు. ఈ సందర్భంలో పోలీసులు మనోజ్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో అక్కడ నుంచి నేరుగా భార్యతో కలసి నారావారిపల్లె వెళ్లిన మంచు మనోజ్ అరగంట పాటు మంత్రి నారాలోకేష్ తో భేటీ అయ్యారు. అనంతరం అక్కడ నుంచి రంగంపేటలో జరుగుతున్న జల్లికట్లు ఉత్సవాలకు వెళ్లారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి నారావారిపల్లో వరకూ పోటాపోటీగా మంచు విష్ణు, మంచు మనోజ్‌ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రికి రాత్రి మంచు మనోజ్ ఫ్లెక్సీలన్నీ గుర్తుతెలియని వ్యక్తులు తొలగించివేశారు.