29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

రాష్ట్ర ప్రగతి, సంక్షేమానికి దిక్సూచిగా మల్లు భట్టి విక్రమార్క

– నిత్యం సమీక్షలు, ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షణ
– రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు
– అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
– విపక్షాల విమర్శలపై తనదైన శైలిలో సమాధానాలు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర పాలనపై, ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజాభవన్‌కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా కలియదిరుగుతున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లాల్లో తరచూ పర్యటనలు చేస్తూ ప్రభుత్వం అప్‌డేట్స్‌, విధాన నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు.

ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓవైపు.. ఎప్పటికప్పుడు పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. తన మంత్రిత్వ శాఖల పనితీరును పర్యవేక్షిస్తూనే.. ఇంకోవైపు జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి అవసరమైనంత మైలేజీ తీసుకొస్తున్నారు. వ్యక్తిగతంగా తనదైన ముద్ర వేస్తున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత.. అన్నీ తానై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ప్రజా భవన్‌లో నిత్యం సమీక్షలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికారుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. తన మంత్రిత్వ శాఖలైన ఆర్థిక, ఇంధనం, ప్రణాళిక శాఖలకు సంబంధించి నిరంతరం ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ ఆయా శాఖలు ప్రగతి పథంలో దూసుకెళ్లేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే తెలంగాణ ఇంధన పాలసీ-2025ను ప్రకటించారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్యం పెంచేందుకు చేస్తున్న ప్రణాళికలను వివరంగా ఆ పాలసీలో చేర్చారు.

మరోవైపు.. రాష్ట్రం నలుమూలలా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం. ఇటీవలికాలంలోనే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలు దాదాపు చుట్టేశారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి మొదలుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కూడా పర్యటించారు. అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు.. ప్రభుత్వ నిర్ణయాలను, కొత్తగా ప్రారంభిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో విపక్షాల విమర్శలను కూడా దీటుగా తిప్పికొడుతున్నారు.

ఈనెల 6వ తేదీన ఉమ్మడి విరంగల్ జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటించారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో రూ 8 కోట్ల 32లక్షలతో నిర్మించనున్న మొగిలిచర్ల,గొర్రెకుంట గరీబ్ నగర్ ,విశ్వనాధపురం 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం యేడాది కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతోందన్నారు. ఏడాదిలోనే రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ రుణమాఫీకోసం 22వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అలాగే, రాష్ట్రంలోని సాగు చేస్తున్న ప్రతి ఒకరాలకూ రైతు భరోసా ఇవ్వనున్నామని ప్రకటించారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.12వేల చొప్పున చెల్లిస్తామన్నారు. అలాగే, అదనంగా భూమిలేని వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12 వేల రూపాయలు చెల్లిస్తున్నామని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదన్నారు. వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని జనంలో.. ముఖ్యంగా రైతుల్లో ప్రభుత్వంపై భరోసా కల్పించారు.

వరంగల్ పర్యటనకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో భువనగిరిలోని బీసీ బాలికల వసతిగృహంతో పాటు.. ఎస్సీ బాలికల హాస్టల్‌లలను సందర్శించారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో పెంచిన మెస్‌ ఛార్జీలను హైలైట్‌ చేస్తూ.. విద్యార్థినులతో ముచ్చటించారు. వాళ్లతో కలిసి భోజనం చేశారు. హాస్టళ్లలో సదుపాయాలు, భోజనంలో నాణ్యత గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు.

ఆ మరుసటిరోజే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు భట్టి విక్రమార్క. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి.. వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం అటవీపార్క్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఇండియా టూరిజం మ్యాప్‌లో జమలాపురం ఫారెస్ట్‌ పార్క్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకంగా ఎర్రుపాలెం మండలం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. అదేరోజు ఆయా గ్రామాల్లో రోడ్లు, మంచినీటి పైపులైన్లు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు.

ఇక, ఈనెల 11వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు భట్టి విక్రమార్క. నాగార్జున సాగర్‌లో ఆదివాసీ సాధికరత శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో ప్రసంగిస్తూ ఎస్సీ, ఎస్టీలకు తనదైన శైలిలో అభయం ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను తుచ తప్పకుండా, పూర్తిగా ఖర్చుచేసే బాధ్యత తనదే అని భరోసా ఇచ్చారు. ఈ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా, లేదా అనే అంశంపై అధికారుల నుంచి నివేదిక కోరామని, నివేదికలు వచ్చాక, తానే స్వయంగా పర్యవేక్షించి నిధులన్నీ సక్రమంగా ఖర్చయ్యేలా చర్యలు తీసుకుంటానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చిందని, వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఆదివాసీలకు వాళ్ల హక్కులను గుర్తు చేశారు. అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.1 లక్ష ఇవ్వబోతున్నామన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మిగతావారితో పాటు గిరిజనులు పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.ఈ దేశంలో హక్కుల కోసం పోరాటం చేయడానికి కావాల్సిన ధైర్యం, స్వేచ్ఛను ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.

ఆ మరుసటిరోజే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటించారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ప్రకటించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని, పాలమూరు జిల్లాకు త్రాగు, సాగు నీరు అందించడానికి కృష్ణా నదిలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ఎంత ఖర్చు చేయడానికి అయినా ప్రజా ప్రభుత్వం వెనుకాడదన్నారు భట్టి విక్రమార్క. రూ. 38వేల కోట్ల తో మొదలుపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గాలికి వదిలేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ ఐదు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామన్నారు. అంతేకాకుండా.. ‘అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ఉమామహేశ్వర, చిన్న కేశవ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,వేల రూపాయలు ఇస్తాం. రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు సబ్సిడీ డబ్బులను రైతుల తరఫున ప్రభుత్వం ఏడాదికి రూ 12 వేల కోట్లు విద్యుత్తు శాఖకు చెల్లిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును గృహ జ్యోతి పథకం ద్వారా గత మార్చి ఒకటి నుంచి ఇస్తున్నాం. డిస్కంలో పై భారం పడకుండా ప్రజా ప్రభుత్వం ఆ డబ్బులను చెల్లిస్తున్నది. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడంతో పాటు పంట బీమా, రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తున్నది. పైరవీలు లేకుండా, దళారుల బెడద లేకుండా అవసరం ఉన్నచోట అడిగిన రైతులకు సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిది. విద్యుత్ శాఖలో అత్యవసర సమస్యల పరిష్కారం కొరకు 1912 నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చాం. రైతులకు, విద్యుత్ అవసరాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన సామాగ్రిని రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీ లేకుండా అందజేయడానికి కావలసిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. అని భట్టి విక్రమార్క సుదీర్ఘంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలను ఏకరువు పెట్టారు.

ఇక, నాగర్‌కర్నూల్‌కు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో షాద్‌నగర్‌లో ఆగిన భట్టి విక్రమార్క.. అక్కడ కూడా తనదైన మార్క్‌చూపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ పర్యటనకు వెళ్తున్న ఆయనకు.. షాద్ నగర్​లోని కేశంపేట బైపాస్ రోడ్డు వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ త్వరలోనే మొదలవుతుందన్నారు. ముందుగా భూ సర్వే కోసం ఒక ప్రణాళిక రూపొందించాక కార్యక్రమాలు మొదలవుతాయని వివరించారు.

తిరిగి ఈనెల 13వ తేదీన మరోసారి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పండుగ సంబరాల్లో ఉన్నజనాలకు సంక్షేమ ఫలాల గురించి కూడా వివరించారు. ఇక వీటితో పాటు.. ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో కూడా భట్టి విక్రమార్క పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించారు. భవిష్యత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఇలా.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనదైన శైలిలో దూసుకువెళ్తున్నారు. ప్రభుత్వం ఇమేజ్‌ను అమాంతం పెంచేస్తున్నారు. పాలనా యంత్రాంగంపై రేవంత్‌రెడ్డి ఓవైపు పట్టుసాధిస్తూ అభివృద్ధి మంత్రం జపిస్తుండగా.. ఇటు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాలు, అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు.

మరోవైపు.. తన పర్యటనల్లో విపక్షాల విమర్శలకు దీటుగా జవాబిస్తున్నారు భట్టివిక్రమార్క. ప్రధానంగా పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ పథకాలు, విధానాలపై చేస్తున్న విమర్శలకు గట్టిగా తిప్పికొడుతున్నారు. విపక్షాన్ని ఆత్మపరిశీలనలో పడేసేలా సెటైర్లు, విసుర్లు, సవాళ్లతో ఢీకొడుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com