- కాంగ్రెస్లో కనిపించని కోఆర్డినేషన్
- కీలకమైన సోషల్ మీడియాలో పొరపాట్లు
- బిఆర్ఎస్ కు అస్త్రంగా మారుతున్న వైఫల్యాలు
- వివాదాలకు పుల్ స్టాప్ పెట్టాలంటున్న సీనియర్లు
- త్వరలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం
- అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ
ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం… అదేంటని అడుగుతే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని కామెంట్లు చేయడం… క్యాడర్‌పై నాయకులు కంట్రోల్ లేకపోవడం… ఒక వ్యవస్థను ఒకరు చూసుకోక పోవడం… ఇది ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన సమస్యలు. వివాదాలు ఆ పార్టీకి కొత్త కానప్పటికీ… తాజాగా సోషల్ మీడియా అంశం మాత్రం ఆ పార్టీకి తలనొప్పి గాని మారింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతోంది. తాము అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా పాత్ర కూడా కీలకమని స్వయంగా కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంగీకరించారు.
అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో కంట్రోల్ లేకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయని నేతల అంగీకరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియానే కాదు పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల పనితీరు వీటికి సంబంధించి పూర్తిగా పట్టు లేకపోవడం వల్ల సమస్యలు రోజురోజుకీ పెరిగిపోవడంతో పాటు ప్రధాన ప్రతిపక్షానికి అవి అస్త్రాలుగా మారుతున్నాయని సీనియర్లు వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారు ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో కంట్రోల్ లో పెట్టారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ స్థాయిలో పని చేస్తే తప్ప ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మరింత చొరవ చూపించాలని ఒకవైపు పార్టీని కంట్రోల్ చేయడంతో పాటు మరోవైపు ప్రభుత్వ పరంగ వివాదాలు రాకుండా చూసుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు.
ఏడాది పాలన పూర్తైన నేపథ్యంలో ప్రజా అభిప్రాయం పేరిట పబ్లిక్ పల్స్ తెలుసుకుందామని సోషల్ మీడియాలో పోల్స్ పెట్టడం… ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా రావడం చాలామందికి మింగుడు పడడం లేదు. పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవసరమని ఇప్పటికే చాలామంది నాయకులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఒకవైపు సోషల్ మీడియా విషయంలో ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ యాక్టివ్ గా ఉంటే కాంగ్రెస్ మాత్రం కొంత వెనుకబడిందన్నది వాళ్లు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇటు పార్టీని అటు ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ ప్రజల్లోకి వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన వాళ్ళు కూడా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
త్వరలోనే ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీనియర్లు ఇప్పటికే రేవంత్ రెడ్డికి సూచించారు.